ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు: జగన్‌


విద్యాశాఖపై సీఎం సమీక్ష

అమరావతి: పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు 'జగనన్న విద్యాకానుక' కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరు రకాల వస్తువులు విద్యాకానుకలో ఉండనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాకానుకకు సంబంధించిన నమూనాలను జగన్‌కు అధికారులు చూపించారు. మూడు జతల యూనిఫామ్స్‌, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్స్‌, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు 'జగనన్న విద్యాకానుక' కిట్‌లో ఉంచాలని సీఎం సూచించారు. విద్యార్థులకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు



నాడు-నేడు' తొలివిడతలో భాగంగా 15,715 పాఠశాలల్లో జూన్‌ నాటికి పనులు పెండింగ్‌లో ఉండకూడదని జగన్‌ ఆదేశించారు.

దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. డిజిటల్‌ విద్యాబోధనకై ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గోరుముద్దకు సంబంధించి బిల్లులు పెండింగులో ఉండకూడదని..నిర్దేశించుకున్న సమయంలోపు ఆ పనులు పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఈ పనుల్లో ప్రగతి కనిపించాలని జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజనం 'గోరుముద్ద'పై యాప్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రతి పాఠశాలకూ స్మార్ట్‌ టీవీలు: జగన్‌"

Post a Comment