మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం రెడీ
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ నెలాఖరులోగా మున్సిపోల్స్‌కు వెళ్లేలా కార్యాచరణతో సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ నెల రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా అధికారుల స్థాయిలో కసరత్తును దాదాపు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఒకట్రెండు సమీక్ష సమావేశాల్లో కూడా మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉంటాయనే సంకేతాలిచ్చారు
ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం మేర రిజర్వేషన్లు ప్రకటించడాన్ని తప్పు పడుతూ సుప్రీం కోర్టుకెళ్లారు. దీనిపై సుప్రీం కోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చింది. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే.. బాగుంటుందనే ఆలోచనకు సర్కార్ వచ్చినట్టు కన్పిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికల నిర్వహాణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్దమవుతున్నాయి. ముందుగా ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావించినా.. కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. దీంతో బ్యాలెట్ పేపర్ల ద్వారా మున్సిపోల్స్ జరపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో బ్యాలెట్ బాక్సులను సప్లై చేయాల్సిందిగా ఏపీ సర్కార్ పొరుగు రాష్ట్రాలను కోరినట్టుగా తెలుస్తోంది. ఇక అన్ని మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లల్లో రిటర్నింగ్ అధికారుల నియామకం చురుగ్గా సాగుతోంది

0 Response to "మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం రెడీ "
Post a Comment