రిజర్వేషన్లు రాష్ట్రాల ఇష్టం
- కల్పించాలని ఒత్తిడి తేరాదు
- నియామకాలు, పదోన్నతుల్లో వారిదే తుది మాట
- ఇది ప్రాథమిక హక్కు కిందకు రాదు
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పన అన్నది రాష్ట్రాల ఇష్టమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగాల భర్తీలో గానీ, పదోన్నతుల్లో గానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం, కల్పించకపోవడం అన్నది గానీ ఆ ప్రభుత్వాల ఇష్టం. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేరాదు. ఆ వర్గాలకు ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం ఉందని, అంచేత కల్పించాల్సిన పనిలేదని ప్రభుత్వాలు భావించవచ్చు... ఒకవేళ కల్పించరాదనుకుంటే అందుకు తగిన డేటా రూపొందించాల్సిన పనిలేదు’’ అని స్పష్టం చేసింది. ‘‘రిజర్వేషన్లన్నవి ప్రా థమిక హక్కు కాదు. ఈ విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉంది. ఫలానా వర్గాలకు ఉద్యోగాల్లోనో లేక ప్రమోషన్లలోనో రిజర్వేషన్లు కల్పించండి అని కోర్టులు సైతం ప్రభుత్వాలను ఆదేశించజాలవు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు నిరాకరించేముందు దాన్ని నిరూపించే డేటా సేకరించండని సర్కార్లను కోర్టులు కోరజాలవు’’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. అత్యంత కీలకమైన ఈ తీర్పు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లు, పదోన్నతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏంటీ కేసు..?
ఉత్తరాఖండ్ ప్రజాపనుల శాఖలోని పోస్టుల భర్తీలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించరాదని 2012 సెప్టెంబరు 5న ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొందరు రాష్ట్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నిర్ణయాన్ని తొలుత కొట్టేసిన హైకోర్టు తిరిగి 2019లో సమీక్షించినపుడు తీర్పును సరిదిద్దుకుంది. ఆ సమయంలోనే ఓ ఆదేశాన్నిచ్చింది. రిజర్వేషన్‌ను నిరాకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం రావడానికి కారణమేంటి, దానికి సహేతుకత ఎంత అన్నది స్పష్టం చేయాలంది. సంబంధిత వర్గాలకు తగిన ప్రాతినిథ్యం ఉందని లేక లేదని తెలియజెప్పే డేటా చూపడం తప్పనిసరి అనీ, ఆ డేటాను సేకరించాలనీ ఆదేశించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. రిజర్వేషన్లన్నవి ప్రాథమిక హక్కు కాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, పీఎస్ నరసింహ వాదించగా, డేటా లేకుండా నిర్ణయాలకు ఎలా వస్తారంటూ ఎస్సీఎస్టీల తరఫున కపిల్ సిబాల్, దుష్యంత్ దవే, కొల్విన్ గోంజాల్వెజ్ వాదించారు. డేటా సమీకరించాల్సిన అవసరం లేదన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.
కోటాపై కోర్టులు సైతం ఆదేశించలేవు
‘‘ఇందిరా సహానీ (మండల్ కమిషన్) కేసులో గానీ, ఎం నాగరాజ, అజిత్ సింగ్, జర్నయిల్ సింగ్ కేసుల్లో గానీ తీర్పులు పరిశీలించినపుడు రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ధర్మాసనాలు ఉత్తర్వులు ఇచ్చిన దాఖలాల్లేవు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్నపుడు ప్రాతినిథ్యానికి సంబంధించిన డేటా అవసరం. ఒకవేళ కల్పించకూడదనుకుంటే డేటా అక్కర్లేదు. తగిన ప్రాతినిథఽ్యం ఉందని ప్రభుత్వం భావించినపుడు దాన్ని సమర్థించుకోవాల్సిన పనిలేదు. ఆఖరికి తమకు తగిన ప్రాతినిథ్యం లేదని ఎస్సీ ఎస్టీలు కోర్టులకెక్కినా సరే, కోర్టులు ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేయజాలవు. సీఏ రాజేంద్రన్ వర్సెస్ సురేశ్ చాంద్ గౌతమ్ కేసులో సుప్రీం ఇచ్చిన రూలింగే దీనికి ప్రాతిపదిక’’ అని బెంచ్ పేర్కొంది. వాదనలను పరిశీలించిన సుప్రీం బెంచ్ హైకోర్టు తీర్పును కొట్టేస్తూ కీలక అభిప్రాయాలను వ్యక్తపరిచింది.
0 Response to "రిజర్వేషన్లు రాష్ట్రాల ఇష్టం"
Post a Comment