5 జోన్లు.. 3 హెల్త్‌ వర్సిటీలు

  • కొత్తగా 17 వైద్యవిద్యా కళాశాలలు: సీఎం
  • 17నుంచి మూడోదశ కంటి వెలుగు
  • ఈసారి పది లక్షల మందికి సర్జరీలు
  • వైద్యఆరోగ్యశాఖలో నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష


అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, వాటి పరిధిలో మూడు హెల్త్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి వస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ‘నాడు - నేడు’, సబ్‌సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య కార్డులు జారీపై మంగళవారం వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
 
ప్రజారోగ్య రంగంపై గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, అందువల్లే ఇవాళ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని జగన్‌ అన్నారు. కర్నూలు- కడప - అనంతపురం, ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు, కృష్ణా - గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలను నాలుగు జోన్లుగా, ఉత్తరాంధ్రను ఒక జోన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాము. ఇన్నింటిని ఒకే యూనివర్సిటీ పర్యవేక్షించడం కష్టమవుతుంది. దీనికోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ మూడు మెడికల్‌ యూనివర్సిటీలు ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. వాటి పరిధిలోని మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అంశాలపై సమగ్రమైన విధానం ఉండాలి. జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా మార్చడంపై దృష్టిపెట్టాలి. దీని వల్ల సిబ్బంది కొరత తీరే అవకాశాలుంటాయి. సరిపడా సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న విధానం చాలా పాతది. కొత్త విధానాలపై ఆలోచనలు చేయాలి. బోధనాసుపత్రులు స్వయం శక్తితో నడిచేలా ఆలోచన చేయాలి’’ అని సూచించారు. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బోధనాస్పత్రులు పెట్టేందుకు అవకాశమున్నదని సీఎంకు అధికారులు వివరించగా, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధనాస్పత్రి ఏర్పాటు చేసి, భవిష్యత్తులోనైనా అవి మెరుగ్గా నడిచేలా ప్రణాళిక తయారుచేయాలని సీఎం సూచించారు.
 
మే లోపే భర్తీ.. ఆ తర్వాత సమస్యలుండొద్దు
‘నాడు - నేడు’లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ఈ కార్యక్రమం కింద అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాది మే నెల నాటికి వైద్య ఆరోగ్యశాఖలో కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ తర్వాత నుంచి ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఏప్రిల్‌ నుంచి డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ (గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలతో కూడిన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అవసరం లేకున్నా గర్భిణులకు సిజేరియన్‌ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సిజేరియన్‌ శాతం తగ్గించాలని, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఆ మేరకు వైద్యులకు సూచనలు చేయాలని, తల్లులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతుందని, ఈ విడతలో దాదాపు 10 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామని సీఎం తెలిపారు. ‘‘ఆస్పత్రుల్లో నాడు - నేడు కార్యక్రమాన్ని కర్నూలులో ప్రారంభించేందుకు ఏర్పాటు చేయండి. అదే రోజు సబ్‌సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిపి, మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలి’’ అని ఆదేశించారు.
 
 
డయాబెటీస్‌, హైపర్‌ టెన్షన్‌, క్యాన్సర్‌, టీబీ, లెప్రసీల గుర్తింపునకు చేసే పరీక్షలను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. అలాగే, మార్చి 15 నాటికి అందరికీ హెల్త్‌ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. నవశకం కింద 1.63 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులకు అర్హులుగా గుర్తించామని, వారికి మార్చి 15 లోగా కార్డులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. వైఎ్‌సఆర్‌ ఆరోగ్య ఆసరా కింద ఫిబ్రవరి 2 వరకూ 46,725 మందికి రూ.33.14 కోట్లు పంపిణీ చేశామని అధికారులు చెప్పగా, రోగి డిశ్చార్జ్‌ అవుతున్నప్పుడే ఆ డబ్బును చేతిలో పెట్టాలని సీఎం ఆదేశించారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపుపై పశ్చిమగోదావరిలో చేపడుతున్న ఫైలట్‌ ప్రాజెక్టు అమలు తీరుపై సీఎం జగన్‌ ఆరా తీశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 5 జోన్లు.. 3 హెల్త్‌ వర్సిటీలు"

Post a Comment