నేడే క్లైమాక్స్‌

  • తేలనున్న మండలి భవిష్యత్‌
  • రద్దు దిశగానే జగన్‌ అడుగులు!
  • నేడు కేబినెట్‌లో నిర్ణయం.. చర్చ
  • అప్పటికి తగినన్ని చేరికలుంటే
  • మండలి కొనసాగింపునకూ వీలు
  • లేదంటే మాత్రం కౌన్సిల్‌ అవుట్‌


అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి రద్దు కథ దాదాపు క్లైమాక్స్‌కు చేరింది. శాసనమండలిని రద్దు చేస్తారా? లేక యథాతథంగా కొనసాగిస్తారా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతుంది. శాసనమండలి భవితవ్యం ఇక్కడే తేలిపోతుంది. అధికారపక్షం అనుకున్నట్లుగా బలం వస్తే ..ప్రతిపక్షం నుంచి పాలకపక్షానికి ఎమ్మెల్సీలు వలసవస్తే .. శాసనమండలి ‘‘ సేఫ్‌ ’’ గా ఉంటుందని, కాని పక్షంలో కౌన్సిల్‌ రద్దవుతుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 

ఏమైనా మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వ నిర్ణయమేమిటో తేలిపోతుందని అంటున్నారు. కౌన్సిల్‌ రద్దు చేయాలనుకొంటే.. మంత్రివర్గ సమావేశంలోనే దానిపై తీర్మానం చేస్తారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు 99 శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే సీఎం జగన్‌ ఉన్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఆశించిన స్థాయిలో చేరికలుంటే మాత్రం ఆయన పునరాలోచిస్తారని వెల్లడించడం గమనార్హం. సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఫలితంగా శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో జగన్‌ ఉన్నారని అధికారపక్షం చెబుతుంది. అయితే, దీనిపై మంత్రివర్గంలో తీసుకునే వైఖరికి అనుగుణంగా అసెంబ్లీలో సీఎం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
 
గట్టి నేతలు గల్లంతు
ఒకవేళ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపితే అది వైసీపీకే ఎక్కువ నష్టమని విపక్షాలు వాదిస్తుండటం ఆసక్తికరం. మరో ఏడాది తర్వాత శాసనమండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో అధికులు రిటైర్‌ అవుతున్నారు. 2021, 2023 లలో జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా రిటైర్‌ అవుతుంటే .. ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. వైసీపీలో శాసనసభ్యులకు ధీటైన స్థాయిలో ఉన్న నేతలకు శాసనమండలిలో స్థానం కల్పించడం ద్వారా .. నేతలందరికీ పదవులు ఇచ్చి సంతృప్తి పరచేందుకు వీలుకలుగుతుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. శాసనమండలి రద్దయితే పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌ .. మోపిదేవి వెంకటరమణారావు వంటివారు తమ ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోతారు. వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానాలు ఖాళీచేసి, ఆరునెలల్లో వాటికి ఎన్నికలు జరిగితేనే వారు మంత్రివర్గంలో కొనసాగే వీలుంటుంది.
 
వైసీపీ మైండ్‌గేమ్‌: మంతెన
‘తప్పుడు ఫోన్‌ కాల్స్‌తో వైసీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు ‘టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. మీ ఎమ్మెల్సీ ఎలాంటి వ్యక్తి. డబ్ముకు అమ్ముడుపోతాడా?’ అంటూ వివరాలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. 8634503099 (ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ) 9705782106(పార్టీ ఆఫీస్‌) నంబర్ల నుంచి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ కార్యకర్తలకు ఫోన్లు చేశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు కాల్స్‌చేసి కార్యకర్తలను, ఎమ్మెల్సీలను అయోమయానికి గురి చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామన్నారు

Additional information

కౌన్సిల్‌లో కీలక బిల్లులను అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీ 

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను నిలిపివేసిన ప్రతిపక్షం 

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. ఆంగ్ల మాధ్యమం బిల్లులపైనా వ్యతిరేకత 

సలహాలు, సూచనలు ఇవ్వకుండా.. రాజకీయ కారణాలతో అడ్డగింత 

నేడు కేబినెట్‌ భేటీ.. అనంతరం శాసనసభ సమావేశం 

శాసన మండలి రద్దుకే మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కారు 

మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!    

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష  తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వడం శాసన మండలి ప్రధాన కర్తవ్యం. కానీ,  ప్రతిపక్షం రాజకీయ కారణాలతో కీలక బిల్లులకు అడ్డుపడుతుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లులను సైతం మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. 

రద్దుకు అనుకూలంగానే నిర్ణయం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్‌ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్‌ రాజధాని, జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. 

మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన 
అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేడే క్లైమాక్స్‌"

Post a Comment