స్ట్టేట్‌బ్యాంకులో కొలువు ఖాతా
8224 క్లరికల్ పోస్టులకు ఎస్‌బీఐ నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగం కొట్టాలనుకునే అభ్యర్థులకు ఓ శుభవార్త! దేశంలో ప్రథమ స్థానంలో, ప్రపంచ స్థాయిలో మొదటి వంద బ్యాంకుల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు పేరు. దీన్నుంచి తాజాగా ఎనిమిది వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రణాళికతో శ్రద్ధగా సిద్ధమై తగిన సాధన చేస్తే విజయం తథ్యం!
రెండు దశల్లో నిర్వహించే ఎస్‌బీఐ ఆన్‌లైన్ రాతపరీక్షల్లో ప్రిలిమ్స్ ఫిబ్రవరి/ మార్చి నెలల్లో, మెయిన్స్‌ను ఏప్రిల్‌లో
ప్రిలిమినరీ పరీక్షకు కేవలం రెండు నెలల సమయమే ఉంది. తొలిసారి సన్నద్ధమవుతున్నవారికి సమయం సరిపోతుందో లేదోనన్న సందేహముంటుంది. కానీ సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఈ సమయం తప్పక సరిపోతుంది.
ప్రిలిమ్స్‌తోపాటే..: ప్రిలిమినరీలో సబ్జెక్టులన్నీ మెయిన్స్‌లోనూ ఉన్నాయి. ప్రిలిమ్స్‌లోని మూడు విభాగాలకు బాగా సన్నద్ధమైతే మెయిన్స్‌కు దాదాపు 70% సన్నద్ధత పూర్తిచేసినట్లే. అందువల్ల ప్రిలిమ్స్‌లో ఉండే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు మెయిన్స్ స్థాయిలో సన్నద్ధమవ్వాలి. సమయం ఉంటే మెయిన్స్‌లో మాత్రమే ఉండే జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లకు ఇప్పటినుంచే ప్రాధాన్యమివ్వాలి. రోజుకు కనీసం ఒకటి లేదా రెండు గంటలు కేటాయిస్తే మంచిది.
గత ప్రశ్నలపై అవగాహన: సన్నద్ధత ప్రారంభించే ముందు గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. గత రెండు, మూడేళ్లలో విభాగాల నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య, స్థాయులను గమనించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అడిగే ప్రశ్నల స్థాయిల భేదాన్ని పరిశీలించాలి.
రోజుకో టాపిక్: అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ల నుంచి ప్రతిరోజూ ఒక టాపిక్ పూర్తయ్యేలా చూసుకోవాలి. ప్రాథమికాంశాలను అవగాహన చేసుకుని వాటిలో వివిధ స్థాయుల్లో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ల్లో ఒక్కోదానిలో దాదాపుగా 20 దాకా టాపిక్‌లు ఉంటాయి. వీటన్నింటిపై నెలరోజుల్లో పూర్తి పట్టు సాధించగలగాలి.
ఇంగ్లిష్‌లో మాత్రం పరీక్షల్లో ఎలాంటి మాదిరి ప్రశ్నలు వస్తున్నాయో వాటినే సాధన చేయాలి. ఈ సమయంలో సందేహాలు వస్తే నిర్దేశిత గ్రామర్ విభాగాన్ని పరిశీలించాలి. ఇది ఎక్కువ ఉపయోగకరం.
మొదటిరోజు నుంచే..: సాధన చేస్తూనే ప్రిలిమ్స్ తరహాలో సమయాన్ని నిర్దేశించుకుని ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని/ గ్రాండ్ టెస్ట్‌ను సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష విధానానికి అలవాటుపడటమే కాకుండా నిర్దేశిత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నారో తెలుస్తుంది. ఆ సంఖ్య పెరిగేలా సాధనకు మెరుగులు దిద్దుకోవాలి. కొత్త అంశాలను నేర్చుకుంటూ సాధన చేస్తే సాధించే ప్రశ్నల సంఖ్య కూడా సహజంగానే పెరుగుతుంది.
అన్ని సబ్జెక్టుల్లోని అంశాలపై అవగాహన వచ్చిన తరువాత వివిధ స్థాయుల్లోని ప్రశ్నలను సాధన చేస్తూ నిర్దేశిత సమయంలో వీలైనన్ని సాధించేలా చూసుకోవాలి
పరీక్ష విధానంలో మార్పులేదు
ఎస్‌బీఐ పోస్టుల భర్తీకి 2016, 2018, 2019, 2020ల్లో విడుదల చేసిన నోటిఫికేషన్లలోని పరీక్షవిధానం 2016లోని ప్రిలిమినరీ పరీక్షలో 60 నిమిషాల కంపోజిట్ టైమ్ మినహా అన్నింటిలోనూ ఒకేలా ఉంది. పరీక్ష విధానంలో ఏ మార్పూ లేకపోవడం కలిసొచ్చే అంశమే. ఎందుకంటే సాధన చేయడానికి అభ్యర్థులకు ఎక్కువ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. 2016, 2018, 2019ల్లో వివిధ దశల్లో నిర్వహించిన ప్రశ్నపత్రాలను బాగా సాధన చేయాలి. ఇవి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. వీటి ద్వారా ఏ స్థాయిలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముందో అర్థమవుతుంది.
వేగం, కచ్చితత్వం
ప్రిలిమినరీలో అన్ని విభాగాలకూ కలిపి సగటున ప్రశ్నకు 36 సెకన్లు, మెయిన్స్‌లో 50.5 సెకన్ల సమయముంది. పరీక్షల్లోని ప్రశ్నల స్థాయినిబట్టి ఇది చాలా తక్కువ సమయమే. కాబట్టి, చాలా వేగంగా ప్రశ్నలు సాధించేలా చూసుకోవాలి. నెగెటివ్ మార్కులున్నాయి. కచ్చితమైన సమాధానాలు రాబట్టగలగాలి. కాబట్టి అభ్యర్థులు ఈ రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలి. పరీక్షలో 95% కచ్చితత్వంతో 90%కుపైగా ప్రశ్నలు సాధించగలిగితే తప్పక విజయం వరిస్తుంది.
- డాక్టర్ జి.ఎస్. గిరిధర్
ముఖ్య తేదీలు
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
వయసు (01.01.2020 నాటికి): 20-28 ఏళ్లు (జనరల్ అభ్యర్థులకు)
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ వారికి రూ.600; ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.100
దరఖాస్తుకు చివరితేది: 26.01.2020
ఆన్‌లైన్ పరీక్ష: ప్రిలిమినరీ- ఫిబ్రవరి/ మార్చి 2020;
మెయిన్స్- 19.04.2020
0 Response to "స్ట్టేట్‌బ్యాంకులో కొలువు ఖాతా"
Post a Comment