జగనన్న గోరుముద్ద'గా మధ్యాహ్న భోజనం!



అమరావతి: విద్యార్థులకు మనం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి చదువేనని.. నాణ్యమైన విద్య అందిస్తే వారి జీవితాలు బాగుపడతాయని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తూ చేపడుతున్న కార్యక్రమమే అమ్మఒడి అని ఆయన చెప్పారు. అసెంబ్లీలో అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 82లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని.. ఆర్థిక ఇబ్బందులతో వారి చదువు ఆగకూడదనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులకు సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.6,028 కోట్లు జమ చేశామన్నారు

సాంకేతిక కారణాలతో కొంతమందికి అందలేదని.. మరో వారంలోపు అర్హులందరికీ నగదు జమచేస్తామని జగన్‌ స్పష్టం చేశారు.

కొత్త మెనూ అమలు చేస్తున్నాం..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు. రోజూ ఒకే రకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేశామన్నారు. ఈ పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా నామకరణం చేసినట్లు జగన్‌ ప్రకటించారు. కొత్త మెనూను ఈరోజు నుంచే అమలు చేస్తున్నామని వివరించారు. మధ్యాహ్నం భోజన పథకం ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచామన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.344 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు.

పర్యవేక్షణకు నాలుగంచెల వ్యవస్థ

మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు నాలుగంచెల వ్యవస్థను తీసుకొస్తున్నామని జగన్‌ తెలిపారు. పాఠశాల అభివృద్ధి కమిటీ నుంచి ముగ్గురికి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తామన్నారు. వారితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారి నాణ్యతను పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రోజువారీ నివేదికను అందజేసేలా చర్యలు చేపడతామన్నారు. వీరందరిపై ఆర్డీవో స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇంగ్లిష్‌ మీడియం చదువులతో విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని.. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుందన్నారు. దీనిపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న గోరుముద్ద'గా మధ్యాహ్న భోజనం!"

Post a Comment