ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ మాటేమిటి?
ఖాళీలపై అస్పష్టత
క్రమబద్ధీకరణపైనా కొలిక్కిరాని నిర్ణయం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జనవరి ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయా శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయోనన్న వివరాలు ఏపీపీఎస్సీకి అందలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్న సమయంలో ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సమావేశం నిర్వహించలేదు
దీంతో ఖాళీలపై స్పష్టత రాలేదు. ఉద్యోగ ఖాళీల గుర్తింపులో ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ గురించి అధికారులు ఆలోచిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ కేడర్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఇతర శాఖల్లో ఒప్పంద విధానంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి సేవల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. కొత్తగా ఉద్యోగ ఖాళీలు గుర్తించాలంటే ఈ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 410 అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. వచ్చే ఫిబ్రవరిలో రాత పరీక్ష జరగబోతుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో 350 మంది ఒప్పంద విధానంలో పనిచేస్తున్నారు. కొత్తగా మంజూరు చేసిన 12 ప్రభుత్వ పాలిటెక్నిక్, సెకండ్ షిఫ్ట్‌లో నడిచే పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలంగాణలో మాదిరిగా పోస్టులు మంజూరు చేసి, న్యాయం చేయాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈడబ్ల్యూఎస్ అమలుపై ఉత్తర్వులేవి?
విద్యారంగ ప్రవేశాల్లో మాదిరిగానే ఉద్యోగాల భర్తీలోనూ 'ఈడబ్ల్యూఎస్' విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గత నెల 25న ఏపీపీఎస్సీ నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో 42 ఏళ్ల వరకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. మళ్లీ మరోమారు వెసులుబాటు కల్పించే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరిగినా ఉత్తర్వులు రాలేదు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు
0 Response to "ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ మాటేమిటి?"
Post a Comment