జీతాలు 9.2 శాతం పెరుగుతాయ్, కానీ
న్యూదిల్లీ: దేశంలో వేతన జీవులకు 2020లో జీతాల్లో వృద్ధి శాతం 9.2 శాతంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ద్రవ్యోల్బణం లెక్కలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాస్తవంగా దక్కేది 5 శాతం మాత్రమేనని ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీ కోర్న్ ఫెర్రీ అంచనా వేసింది. గ్లోబల్ శాలరీ ఫోర్‌కాస్ట్ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది దేశంలో 10 శాతంగా ఉన్న జీతాల్లో వృద్ధి వచ్చే ఏడాది 9.2 శాతంగా ఉండనుందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ద్రవ్యోల్బణం లెక్కల అనంతరం దక్కేది ఐదు శాతం మాత్రమేనని పేర్కొంది. ఆసియా దేశాలతో పోల్చినప్పుడు ఇదే
అత్యధికమని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న ప్రగతశీల సంస్కరణల ప్రభావం వల్ల వివిధ రంగాల్లో ఆశావహ దృక్పథం నెలకొందని, దీంతో జీతాలు పెరిగే అవకాశం ఉందని కోర్న్ ఫెర్రీ ఇండియా ఛైర్మన్, రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనీత్ సింగ్ తెలిపారు
మరోవైపు ప్రంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జీతాల్లో 4.9 శాతం పెరుగుదల ఉండబోతోంది. ద్రవ్యోల్బణం 2.8 శాతం ఉండగా.. వాస్తవ జీతంలో పెరుగుదల 2.1 శాతంగా ఉండబోతోందని కోర్న్ ఫెర్రీ నివేదిక పేర్కొంది. ఆసియాలో 5.3 శాతం జీతాల్లో పెరుగుదల ఉండబోతోందని, ద్రవ్యోల్బణం 2.2 శాతం మినహాయింపు అనంతరం వాస్తవ జీతంలో 3.1 శాతం మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. మిగిలిన ఆసియా దేశాలైన ఇండోనేసియాలో జీతాల్లో పెరుగుదల 8.1శాతం ఉండనుండగా.. మలేసియాలో 5 శాతం, చైనా 6 శాతం, కొరియాలో 4.1 శాతం చొప్పున జీతాలు పెరగనున్నాయని కోర్న్ ఫెర్రీ అంచనా వేసింది. జపాన్‌లో కనిష్ఠంగా 2 శాతం, తైవాన్‌లో 3.9 శతం చొప్పున జీతాల్లో పెరుగుదల కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. 130 దేశాల్లో 25 వేల సంస్థల నుంచి 2 కోట్ల మంది ఉద్యోగుల డేటా ఆధారంగా కోర్న్ ఫెర్రీ ఈ నివేదికను రూపొందించింది
0 Response to "జీతాలు 9.2 శాతం పెరుగుతాయ్, కానీ"
Post a Comment