ఖనిజాల కాణాచి కడప జిల్లా
సాక్షి, కడప: రాయలసీమను రత్నగర్బగా పేర్కొంటారు. ఒకప్పుడు మన జిల్లాతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు లభించేవని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో నేటికీ వజ్రాలు లభిస్తున్నాయి. మన జిల్లాలో కూడా ఒకప్పుడు వజ్రాలు లభించేవన్నది చారిత్రక సత్యం. మాన్యువల్ ప్రకారం జిల్లాలోని గండికోట నాడు వజ్రాల వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. సీమ జిల్లాలలో లభించే వజ్రాలను గండికోటకు చేర్చి అక్కడి నుంచి హంపికి తరలించి అక్కడ విదేశీ వ్యాపారులకు బహిరంగంగా విక్రయించేవారని తెలుస్తోంది
బెరైటీస్‌కు పుట్టినిల్లు
బెరైటీస్ ఖనిజానికి పర్యాయపదం మన జిల్లా. ఇక్కడ గ్రే, వైట్ రెండు రకాల బెరైటీస్ లభిస్తోంది. ఓబులవారిపల్లె మండలం అనంతరాజుపేట, మంగంపేటలలో గ్రే బెరైటీస్ ఖనిజం సుమారు 74 మిలియన్ టన్నులు ఉన్నట్లు నిపుణుల అంచనా. అందులోని అధిక గురుత్వ శక్తి కారణంగా ఈ పౌడర్‌ను చమురు బావుల డ్రిల్లింగ్‌లో వాడతారు. ఇక్కడ లభించే గ్రే బెరైటీస్‌ను సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది
ప్రపంచంలో లభించే ఖనిజాలలో 28 శాతం మన దేశంలోనే లభిస్తుండగా, అందులో 97 శాతం ఖనిజం మన జిల్లాలోనే నిక్షిప్తమై ఉందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వైట్ బెరైటీస్ జిల్లాలోని వేముల, కొత్తపల్లె, రాజుపాలెం, ఇప్పట్ల ప్రాంతాలలో విరివిగా లభిస్తోంది. జిల్లాలో ఈ రకం 0.7 మిలియన్ టన్నులు నిక్షిప్తమై ఉందని అంచనా. దీనిని పెయింట్లు, పేపరు, నూలు తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
లక్షల టన్నుల నిక్షేపాలు.. ఆస్‌బెస్టాస్
ఆస్‌బెస్టాస్..ఈ ఖనిజం రాళ్ల రూపంలో ఉంటుంది. వాటిని అరగదీస్తే మెత్తని
దూది లాంటి, దారం లాంటి పదార్థం వస్తుంది. దీనికి ఉష్ణ నిరోధకశక్తి అధికం.
పులివెందుల ప్రాంతంలోని బ్రాహ్మణపల్లె, లోపట్నూతల, లింగాల, రామనూతలపల్లె
ప్రాంతాల్లో ఈ ఖనిజం విరివిగా లభిస్తోంది. బ్రాహ్మణపల్లెలో లభించే
క్రోసోటైల్ రకం అస్‌బెస్టాస్ ఎంతో మేలైనదిగా చెబుతారు
జిల్లాలో సుమారు 2.50 లక్షల టన్నుల నిక్షేపాలు ఉన్నాయని నిపుణుల అంచనా. ఇళ్లు, షెడ్లు, కర్మాగారాలు, ఇతర భవనాలకు పైకప్పుగా వాడే సిమెంటు రేకుల తయారీలోనూ, యంత్రాల విడిభాగాలు, విద్యుత్ ఉష్ణ నిరోధక సాధనాల తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. పులివెందుల బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి లోపటన్నూతల గ్రామం వరకు 15 కిలోమీటర్ల పొడవున ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 200 మీటర్ల లోతు వరకు ఈ ఖనిజ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని తెలుస్తోంది.
సిరులు కురిపించే సున్నపురాయి
సిమెంటు పరిశ్రమకు ప్రధానమైనది సున్నపురాయి. జిల్లాలోని ఎర్రగుంట్ల,
జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇది విరివిగా లభిస్తోంది. ఇందులో ఉన్నత శ్రేణి
సున్నపురాయి నిక్షేపాలు ఉండడం విశేషం. జిల్లాలో దాదాపు 100 మిలియన్ టన్నుల
సున్నపురాయి నిల్వలు ఉన్నట్లు అంచనా. మేలురకం సున్నపురాయిని పేపరు తయారీ,
క్రిమిసంహారకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. సున్నపురాయి ఆధారంగానే
జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం, మైలవరం ప్రాంతాల్లో సిమెంటు ఫ్యాక్టరీలను
ఏర్పాటు చేశారు
జిల్లాలో వీటినే పెద్ద పరిశ్రమలుగా చెప్పవచ్చు. నిర్మాణ రంగంలో సిమెంటు
ప్రధానం కావడంతో దీనికి మంచి డిమాండ్ ఉంది. జిల్లాకు ఈ పరిశ్రమ ఆర్థిక
బలాని్నచేకూరుస్తోంది. జిల్లాలో సిమెంటు పరిశ్రమలకు 200 సంవత్సరాలకు సరిపడ
సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. దీన్ని ఆధారంగా ఎర్రగుంట్లలో
జువారి, ఐసీఎల్ సిమెంటు ఫ్యాక్టరీలు ఉండగా, కమలాపురం మండలం
నల్లలింగాయపల్లెలో భారతీసిమెంట్స్, మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల వద్ద
దాల్మియా సిమెంటు కర్మాగారం ఏర్పాటయ్యాయి. సిమెంటు ఫ్యాక్టరీల ద్వారా
స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. –కడప కల్చరల్
0 Response to "ఖనిజాల కాణాచి కడప జిల్లా"
Post a Comment