ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ
కీలక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
గతంలోని తప్పులు సరిదిద్దేలా అడుగులు
ఇప్పటికే ఇంటర్వ్యూ విధానంలో మార్పులు
ఏక బోర్డు విధానం రద్దు..మూడు బోర్డుల ఏర్పాటు
మరిన్ని చర్యల కోసం,నిపుణులు, ప్రజాప్రతినిధులతో నేడు సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రక్షాళన దిశగా రాష్ట్ర
ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో అభిప్రాయాల సేకరణకు
శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజా
ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడానికి సోమవారం విజయవాడలో ప్రత్యేక సమావేశం
నిర్వహిస్తున్నారు. వివాదాలను పరిష్కరించి, నిరుద్యోగులలో విశ్వాసం
నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. టీడీపీ హయాంలో
ఏపీపీఎస్సీ చుట్టూ వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. కమిషన్
నిర్ణయాలపై గతంలో నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. పలు
అడ్డగోలు నిబంధనలు, పరీక్షల నిర్వహణలో, ప్రశ్నపత్రాల తయారీలో తప్పిదాలు
నిరుద్యోగులకు నష్టం కలిగించాయి.
వీటిపై ఎన్నిసార్లు మొత్తుకున్నా కమిషన్ పాలకవర్గం పట్టించుకోలేదు. పైగా
తమను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించడంతో పాటు ఇంటర్వ్యూల్లో వారిని
బ్లాక్‌లిస్టుల్లో పెట్టి భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో నిరుద్యోగులు తమ
సమస్యలను ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వ్యవహారాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
నిర్వహించి, నియామకాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా పలు సూచనలు చేశారు.
గ్రూప్1 పోస్టులు, మరికొన్ని ప్రత్యేక కేటగిరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేశారు.
క్యాలెండర్ ప్రకారం నియామకాలకు ఏటా జనవరిలో కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు
విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో
నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న పలు అంశాలను సరిచేసేలా ఇటీవల కమిషన్
కార్యదర్శి పి.సీతారామాంజనేయులు ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు అందించారు.
ఇంటర్వ్యూలకు చైర్మన్ ఆధ్వర్యంలో ఒకేఒక్క బోర్డు ఉండగా దాన్ని మూడు
బోర్డులుగా మార్పు చేశారు
గత ప్రభుత్వం తప్పుల మీద తప్పులు..
– టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్ అస్తవ్యస్త నిర్ణయాలతో పలు నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి.
– గ్రూప్1 మినహా ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష లేదు. కానీ ప్రిలిమ్స్‌ను కమిషన్ అన్నిటికీ అమలు చేస్తోంది.
– ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక విధానాన్ని
రద్దుచేసి 1:15కు కుదించడంతో నిరుద్యోగులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వం
దీన్ని మార్పు చేసి 1:50కి మార్పు చేసింది.
– గ్రూప్1, గ్రూప్2 సిలబస్‌ను 2016–17లో మార్చారు. ఏడాది తిరగకుండానే మళ్లీ మార్పు చేశారు. దీంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు.
– ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలలో 75 మార్కులుండగా అస్మదీయులకు ఎక్కువ మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారనే విమర్శలున్నాయి.
– పలు పరీక్షల్లో ప్రశ్నలు వాటి సమాధానాల ఆప్షన్లు తప్పుల తడకగా ఇచ్చారు.
ఆంగ్లం నుంచి తెలుగు అనువాదం తప్పులు అభ్యర్థులను తికమకకు గురిచేశాయి.
– గతంలో ఏకంగా 42 ప్రశ్నల్లో తప్పులు రావడంతో ఏపీపీఎస్సీ వాటిని తొలగించాల్సి వచ్చింది.
పారదర్శక విధానాలకు పెద్దపీట
– కమిషన్ కార్యదర్శి పి.సీతారామాంజనేయులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సూచనలతో ఏపీపీఎస్సీ నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తాం. ఏకపక్ష
నిర్ణయాలకు తావుండదు. కమిషన్లో గతంలోని తప్పిదాల వల్ల నిరుద్యోగులు చాలా
నష్టపోయారు. వీటికి బాధ్యులైన వారు తప్పించుకునే పద్ధతి సరికాదు. దీనికి
కమిషన్‌లోని వారిదే బాధ్యత అవుతుంది. అందుకే కమిషన్లో ఎలాంటి లోపాలున్నాయో
విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ప్రజాప్రతినిధులనుంచే తెలుసుకోవాలని
సోమవారం (నేడు) సదస్సు నిర్వహిస్తున్నాం. అందరి నుంచి సూచనలు తీసుకొని
తప్పులు సరిదిద్దుతాం
0 Response to "ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ"
Post a Comment