బ్యాంకుల విలీనం ఆంతర్యం
గత పదిహేనేళ్లుగా మన దేశంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం కొనసాగింది. అయితే ఇటీవలి కాలంలో, ముఖ్యంగా గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య జరిగిన బ్యాంకుల విలీనం ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఉంది. 2019 ఏప్రిల్ లో విజయ బ్యాంకు, దేనా బ్యాంకును బరోడా బ్యాంకులో విలీనం చేశారు
మొట్ట మొదట అనుభవాన్ని చూస్తే బ్యాంకుల పరిమాణానికి, సామర్థ్యానికి పొంతన ఉన్నట్టు కనిపించడం లేదు. పైగా 10 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఆస్తులున్న బ్యాంకులు సమర్థంగా పని చేస్తాయన్న ఆశ లేదు. బ్యాంకులు పెద్దవైనంత మాత్రాన బాగా పని చేస్తాయని చెప్పలేం. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్ద ప్రైవేటు బ్యాంకులకన్నా బాగానే పని చేశాయి. కొన్ని పెద్ద బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే గింజుకుంటు న్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత హయాంలో 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అనేక బ్యాంకులను విలీనం చేసింది. స్టేట్ బ్యాంక్ రూ.52 లక్షల కోట్ల వ్యాపారం చేసినా, మార్కెట్‌లో వాటా 22 శాతం ఉన్నా ఆ బ్యాంక్ విలువ హెచ్.డి. ఎఫ్.సి. బ్యాంకుతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉంది. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు వ్యాపారం, మార్కెట్‌లో వాటా ఎస్.బి.ఐ తో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉంది.
సామర్థ్యాన్ని కేవలం నిర్వహణా సంసిద్ధతను బట్టి మాత్రమే చూస్తే విలీనాల వల్ల మేలు కలిగినట్టు కనిపిస్తుంది. బ్యాంకుల సంఖ్య తక్కువగా ఉంటే వివిధ బ్యాంకులు త్వరితంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాయి. అలాగే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధిపతులను నియమించడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ మీద ఉన్న భారం కూడా తగ్గుతుంది. అలాగే బ్యాంకుల సంఖ్య తగ్గితే చిన్న చిన్న బ్యాంకులు సాధారణంగా ఎదుర్కొనే నిరర్థక ఆస్తుల వంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ సామర్థ్యం నిర్వహణా ఖర్చులను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నది అనుమానాస్పదమే. బ్యాంకు శాఖలను తగ్గించినందు వల్ల ఉద్యోగులను తొలగించే ప్రమాదం ఏమీ లేదని ఆర్థిక మంత్రి భరోసా ఇస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య తగ్గించకుండా, వారిని తిరిగి నియమించి ఖర్చులు ఎలా తగ్గిస్తారో అంతు పట్టదు.
బ్యాంకుల పరిభాషలో సామర్థ్యం అంటే తనకున్న వనరులను వినియోగించి ఆదాయం ఎలా సంపాదిస్తుందన్నదే కొలమానం. ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేయకపోవడానికి అవి రుణాలు ఇచ్చే తీరే ప్రధాన కారణం. ముఖ్యంగా బ్యాంకుల పరిమాణం కన్నా కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇచ్చే విధానమే కీలకమైంది. విలీనం చేయడం వల్ల బ్యాంకుల పరిమాణం పెరుగుతుంది కనక కార్పొరేట్ సంస్థలకు పెద్ద మొత్తాల్లో రుణాలు ఇవ్వడమే కాకుండా తమకు అనువైన రీతిలో వ్యవహరించడం సాధ్యం అవుతుంది. అయినా బ్యాంకులు పెద్దవైనంత మాత్రాన వ్యవస్థాపరమైన లోపాలు మాయమైపోవు. బడా వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడం వైపే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొగ్గు చూపుతాయన్నది చారిత్రక సత్యం. ఈ వైఖరి విలీనాల వల్ల మారుతుందనుకోలేం. పైగా తమ ఆర్థిక స్థితిని మెరుగు పరచుకుని కార్పొరేట్ సంస్థలకు తమకు అనువైన రీతిలో రుణాలు ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇక్కడే మరో సమస్య ఉంది. కార్పొరేట్ సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. దీనివల్ల రుణ బకాయిలు మరింత పెరుగుతాయి. అందువల్ల నిర్వహణా సామర్థ్యం కొరవడినప్పుడు బ్యాంకులు ఎంత పెద్దవైనా ఆశించిన ఫలితాలు సాధిస్తాయనుకోవడం అత్యాశే అవుతుంది.
ఇంతకీ విలీనాల వల్ల బ్యాంకింగ్ రంగం పరిస్థితి మెరుగు పడుతుందని, ఈ విధానం విజయవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోందా? లేదా ఈ సంస్కరణలు మహాద్భుతం సాధించామని చెప్పుకోవడానికే పరిమితం అవుతుందా? అసలు సమస్యలను పరిష్కరించని సంస్కరణలు ఎందుకూ కొరగావు. నిజానికి విలీనం వల్ల ఏం సాధించదలిచారో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అసలు ప్రశ్న ఏమిటంటే మనకు భారీ బ్యాంకుల అవసరం ఏమిటి? చిన్న బ్యాంకులనే సవ్యంగా నిర్వహించలేనప్పుడు పెద్ద వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడున్న ఆస్తులనే బ్యాంకులు సరిగా నిర్వహించలేకపోతున్నాయి. అలాంటప్పుడు భారీ బ్యాంకులను, సంక్లిష్ట బ్యాంకులను ఎలా నిర్వహించగలుగుతాయి?
- (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)
0 Response to "బ్యాంకుల విలీనం ఆంతర్యం "
Post a Comment