వారెవ్వా వాట్సప్ బ్యాంకింగ్... వాడుతున్నారా మరి?

వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు.. దీన్ని వాడని యువత ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ స్థాయిలో యాప్ వినియోగం పెరిగి పోయింది. టెక్స్ట్, వాయిస్ మెసేజ్ లతో పాటు ఫోటో లు వీడియోలు, ఇతర ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో వినియోగపడుతోంది. దీనికి ఉన్న ఆదరణ నేపథ్యంలో వాట్సప్ ద్వారా కూడా సేవలు అందించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వివిధ రకాల సమాచారాన్ని పంపుతున్నాయి.




సాధారణ, జీవిత బీమా కంపెనీలు పాలసీ తీసుకున్న కస్టమర్ల మొబైల్ నెంబరుకు పాలసీ డాక్యుమెంట్లను పంపిస్తున్నాయి. దీని వల్ల పాలసీదారులకు ఎంతో ప్రయోజనం జరుగుతోంది. పలు కంపెనీలు కూడా సమాచారం, ఫోటోలు వంటివాటిని తమ కస్టమర్లతో పంచుకుంటున్నాయి.



బ్యాంకులు వాట్సప్ బాటలో...

టెక్నాలజీని వినియోగించుకొని తమ కస్టమర్లకు మెరుగైన సదుపాయాలు అందించడంలో బ్యాంకులు ఎప్పుడు ముందుంటున్నాయి. ఇప్పటికే ఎస్సెమ్మెస్, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన బ్యాంకులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా కస్టమర్లకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నాయి. వాట్సప్ ద్వారా తమ ఖాతాకు సంభందించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని లావాదేవీలను కూడా నిర్వహించవచ్చు.


రిజిస్ట్రేషన్ ఇలా...

* చాలా ప్రయివేట్ బ్యాంకులు తమ కస్టమర్లు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిని వినియోగించుకోవాలంటే ముందుగా తమ మొబైల్ నెంబర్ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం బ్యాంకులు నిర్దేశిత మొబైల్ నెంబర్ ను ఏర్పాటు చేస్తాయి. ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అవసరమైతే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్ ను బ్యాంకుల వెబ్ సైట్ లేదా బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.

* వాట్సప్ నెంబర్ ఒక్కో బ్యాంకుకు ఒక్కోటి ఉంటుంది. ఈ నెంబర్ కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ చేయడం తప్పని సరి.

* ఇలా కాల్ చేసిన తర్వాత బ్యాంక్ వాట్సప్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ నెంబర్ ను కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోవాలి.

* మీరు దానికి ప్రతి స్పందనగా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఏమని మెసేజ్ వేయాలన్నది మీ బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.



ఏయే సర్వీసులు పొందవచ్చంటే..

* వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసులకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అలర్ట్ మెసేజ్ లు, నోటిఫికేషన్లు వస్తుంటాయి.

* వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవడానికి బ్యాంకులు ఏమి చార్జీలను వసూలు చేయవు.
* మీరు కోరిన సమాచారం వెంటనే అందుతుంది.
* ఇక సర్వీసుల విషయానికి వస్తే..
* ఖాతాలో నిల్వ
* గత మూడు లావాదేవీలు, మినీ స్టేట్ మెంట్
* అకౌంట్ స్టేట్ మెంట్
* చెక్ స్టేటస్
* కొత్త చెక్ బుక్ కోసం అభ్యర్థన
* సమీపంలోని ఏటీఎం సమాచారం
*సమీపంలోని శాఖా వివరాలు
* క్రెడిట్ కార్డు దరఖాస్తు స్టేటస్
* పాన్ అప్డేషన్
* ఆధార్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్డేషన్
* క్రెడిట్ కార్డు బ్యాలెన్స్, క్రెడిట్ లిమిట్
* రివార్డ్ పాయింట్స్
* ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు
వీటితో మరిన్ని వివరాలను వాట్సప్ ద్వారా పొందవచ్చు.



అప్రమత్తత అవసరం..

* మీరు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ మరొకరి చేతికి వెళితే మీ బ్యాంకు వివరాలు వారికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన సెక్యూరిటీ అవసరం.

* ఫోన్ ను కోల్పోయిన సందర్భంలో వెంటనే దాన్ని బ్లాక్ చేయడం మంచింది. మీకు అవసరమైన లావాదేవీల వివరాలు పొందగానే దాన్ని డిలీట్ చేస్తే మేలు.
* మీకు వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసులు అవసరం లేదను కుంటే డీ ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అన్నది మీ బ్యాంక్ బ్యాంకు వెబ్ సైట్ ద్వారా తెలుసు కోవచ్చు.
మరేందుకు ఆలస్యం... సులభంగా బ్యాంకింగ్ సర్వీసులు పొందే సదుపాయాన్ని మీ బ్యాంకు అందిస్తుందో లేదో తెలుసుకోండి మరి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వారెవ్వా వాట్సప్ బ్యాంకింగ్... వాడుతున్నారా మరి?"

Post a Comment