డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తాం: సీఎం జగన్
అనంతపురంలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభించిన సీఎం
ఆరోగ్య శ్రీలో 2వేల వ్యాధులు చేరుస్తాం
జనవరి 1 నుంచి డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్
వెనకడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తాం
ఆనంతపురం జిల్లా మనవడిని.. జిల్లా రూపురేఖలు మారుస్తా: సీఎం వైఎస్ జగన్
డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్
త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తాం. అదేవిధంగా 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. పలాస, మర్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తాం. డిసెంబర్‌లో ప్రజలందరికీ కొత్త ఆరోగ్యకార్డులు ఇస్తాం.
మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేరుస్తాం. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం. జనవరి 1 నుంచి డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తాం. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. నేను అనంతపురం జిల్లా మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు. మీ జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నాను’అని సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు
Additional information
సాక్షి, అనంతపురం: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగురువారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు
అంతకుముందు సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు. గురువారం ఉదయం అనంతకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఏపీలోని 62 వేల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు
అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో మంత్రి కొడాలి నాని, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ శేషగిరిబాబు, ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ ముత్యాలరాజు ప్రారంభించారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చికిత్సలు
వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు
0 Response to "డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తాం: సీఎం జగన్"
Post a Comment