ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు తీపికబురు!

విజయవాడ: ఆర్టీసీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల నుంచే వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెలలో పదవీ విరమణ పొందే ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకుగాను సీఎం సూత్రపాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. 



వయోపరిమితి పెంపును ఈనెల నుంచే వర్తింపజేయాలని ఆర్టీసీ విలీన కమిటీ ప్రభుత్వానికి సూచించిన మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వయో పరిమితి పెంపును వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం

ఐదు సూచనలు చేసిన అధ్యయన కమిటీ

అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని ఆర్టీసీ విలీన, విద్యుత్తు బస్సుల ప్రవేశంపై ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ సీఎంకు శుక్రవారం నివేదికను అందజేసింది. ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ప్రవేశ పెట్టేందుకు అనుసరించే విధానాలపై అధ్యయన కమిటీ సభ్యులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఐదు విధానాలను ప్రస్తావిస్తూ వాటిని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు విధానం కింద టెండర్లు పిలిచి కొన్ని బస్సులు ప్రవేశపెట్టాలని కమిటీ సూచించింది. యువతకు స్వయం ఉపాధి కింద కొన్ని బస్సులను ప్రవేశపెట్టేలా అవకాశం కల్పించాలని సూచించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీలో పెట్టి నడుపుకునేందుకు కొన్ని ఔత్సాహిక ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వొచ్చని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం త్వరలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు తీపికబురు!"

Post a Comment