ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు: సుధీర్ బాబు బదిలీ: విలీనం దిశగా తొలి అడుగేనా?

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా తొలి అడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి సారథ్యం వహిస్తూ వచ్చిన ఆర్టీసీ బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారి చేతికి అప్పగించింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తోన్న ఎంటీ కృష్ణబాబును ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కృష్ణబాబుకు పూర్తి స్థాయి అదనపు బాధ్యత (ఎఫ్ఎసీ)లను అప్పగించింది. ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ సురేంద్ర బాబును బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు




ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు..

ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నియమితులు కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ఆర్టీసీ ఆవిర్భవించిన తొలి రోజుల్లో మాత్రమే ఐఎఎస్ అధికారి ఆ సంస్థకు వీసీ అండ్ ఎండీగా కొనసాగారు. అనంతరం ఐపీఎస్ అధికారిని ఈ స్థానంలో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకు కూడా ఐపీఎస్ అధికారే ఎండీగా కొనసాగారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల వ్యవధిలోనే దీన్ని ఆచరణలో పెట్టారు.


సిఫారసుల్లో మార్పులు లేకుండా అమలు..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నెల 3వ తేదీన ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుల్లో ఏ ఒక్క మార్పు కూడా చేయలేదు ప్రభుత్వం. ఇచ్చిన సిఫారసులను ఇచ్చినట్టే అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో విలీనం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో కొనసాగిన ఆర్టీసీ బాధ్యతలను ఐఎఎస్ చేతికి అప్పగించడంతో శ్రీకారం చుట్టినట్టుగా భావించ వచ్చని ఆర్టీసీ కార్మిక సంఘాలు 




ప్రజా రవాణా శాఖగా నామకరణం..

ప్రభుత్వంలో విలీనమైన అనంతరం ఆర్టీసీ పేరును మారుస్తామని, దీన్ని ప్రజా రవాణాశాఖగా నామకరణం చేస్తామంటూ ఆ శాఖ మంత్రి పేర్ని నాని ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో ఆ సంస్థకు గుదిబండగా మారిన అప్పులు, నష్టాలు.. ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రభుత్వపరమౌతాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేలకు పైగా బస్సులు, 128 డిపోలు, ఆర్టీసీకి ఉన్న స్థిర, చరాస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆవిర్భవిస్తారు. ఇతర శాఖల ఉద్యోగులతో సమానంగా వారికి జీతబత్యాలు, ఇతరత్రా అలవెన్సులను చెల్లిస్తుంది ప్రభుత్వం. దీనితో పాటు పదవీ విరమణ వయస్సు కూడా 58 నుంచి 60 సంవత్సరాలకు పెరుగుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఐఎఎస్ అధికారి చేతికి ఆర్టీసీ పగ్గాలు: సుధీర్ బాబు బదిలీ: విలీనం దిశగా తొలి అడుగేనా?"

Post a Comment