పంట పొలాల నుంచి చంద్రయాన్‌ వరకు

ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ ప్రస్థానమిది!

కె. శివన్‌ పిళ్లై సన్‌ ఆఫ్‌ సన్నకారు రైతు. 'ఇస్రో ఛైర్మన్‌'..ఈ పేరు తన పేరు ముందు చేర్చుకోవడం వెనక ఎన్నో కష్టాలున్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు ఈయన స్వస్థలం. చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలను దగ్గరుండి చూసిన వ్యక్తి. తల్లిదండ్రుల రెక్కల కష్టం ఎరిగిన బిడ్డ. పెద్ద చదువులు చదవాలన్న కోరికలకు పేదరికం ఎప్పటికప్పుడు కళ్లెం వేసింది. అలాంటి పరిస్థితులను దాటి, పేదరికాన్ని ఎదిరించి ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఈయన ఎదిగిన తీరు ప్రతి పేద బిడ్డకూ ఆదర్శవంతమే. చంద్రయాన్‌-2 ఫలితం ఎలాగున్నా దాని వెనక ఈయన కష్టం వర్ణనాతీతం



ల్యాండర్‌ విక్రమ్‌తో సంకేతాలు తెగిపోయాయని తెలియగానే ఆయన పడిన వేదన అనిర్వచనీయం. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించి వస్తుండగా శివన్‌ భావోద్వేగానికి గురయిన క్షణాలు చాలు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వారెంత నిష్టగా, ఇష్టంగా చేశారో చెప్పడానికి. తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు

కళాశాల వరకు చెప్పుల్లేవ్‌.. 
విద్యార్థిగా ఉన్న సమయంలో రెండు ట్రౌజర్లు కూడా లేవు. ధోతీలనే వాడేవారు. మద్రాసు ఐఐటీలో చేరిన సమయంలోనే తొలిసారిగా చెప్పులను వేసుకున్నారట. అప్పటివరకు కాళ్లకు చెప్పుల్లేకుండా తన విద్యాభ్యాసం గడిచింది. అయినా ఇలాంటివేవీ తనన కలవరపెట్టేవి కాదట. తనకున్న వాటినే మహాప్రసాదంగా భావించేవాడినంటారు శివన్‌.

సొంత పొలంలోనే కూలీగా... 
పాఠశాల దశలో ఉన్నప్పుడు సాయంత్రం బడి నుంచి రాగానే వెంటనే పొలంబాట పట్టేవారు. ఈయన తండ్రి మామిడి రైతు కావడంతో తండ్రికి సాయంగా వెళ్లేవారు. పాఠశాల పూర్తయిన అనంతరం తోటి విద్యార్థులు బడా కళాశాలల్లో చదువుకుంటే.. తన తండ్రి మాత్రం తన ఇంటి వద్ద ఉండే కాలేజీలోనే చేర్పించారు. ఇంటికి దగ్గరలో ఉంటే పొలంలో సాయం చేస్తారన్నఆశ ఆయనది. శివన్‌ పొలానికి వెళ్లిన పూట ఆయన తండ్రి కూలీలను నియమించుకునేవారు కాదట. సహనం, పరిశోధించే లక్షణం వ్యవసాయ పనులు చేయడం ద్వారానే అలవడిందని ఒకానొక సందర్బంలో ఆయన చెప్పుకొచ్చారు. ఎంత కటిక పేదరికంలో ఉన్నా తన తల్లిదండ్రులు మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టేవారని తెలిపారు.

మనసు ఇంజినీరింగ్‌ వైపు..పరిస్థితులు డిగ్రీ వైపు 
తోటి విద్యార్థుల్లా ఇంజినీరింగ్‌ చేయాలని ఆయనకున్నా పరిస్థితులు అందుకు సహకరించలేదు. దీంతో ఆయన బీఎస్సీ మాథమేటిక్స్‌లో చేరాల్సి వచ్చింది. ఈయనలో మాత్రం ఈ వెలితి అలాగే ఉండిపోయింది. దీన్ని గమనించిన శివన్‌ తండ్రి పొలం అమ్మి మరీ ఇంజినీరింగ్‌లో చేర్పించారు. దీంతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు


నెక్స్‌ ఏంటి? 
పచ్చని పంట పండే పొలాలు అమ్మి ఇంజినీరింగ్‌ అయితే పూర్తి చేశారు గానీ..తర్వాత ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో ఉద్యోగాలు తక్కువ కావడంతో నౌకరీ కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), నేషనల్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌)లో ఉద్యోగాలున్నప్పటికీ తన వరకూ రాలేదు. దీంత ఇంకా పై చదువులు చదవాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరారు.

ఇష్టంలేని ఉద్యోగమే పేరు తెచ్చిపెట్టింది 
చదువు పూర్తవ్వగానే శాటిలైట్‌ సెంటర్‌లో చేరాలనే కోరిక కలిగింది. కానీ, ఆయనకు విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌లో అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఏరోడైనమిక్స్‌ గ్రూప్‌తో చేరాలని ఆశించారు. కానీ ఆయనను పీఎస్‌ఎల్‌వీలోకి తీసుకున్నారు. ఏ దశలోనూ తను అనుకున్నది మాత్రం దక్కలేదని అంటుంటారాయన. అక్కడ నుంచి మొదలైన ప్రయాణం ఇస్రో ఛైర్మన్‌ స్థాయికి చేర్చింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పంట పొలాల నుంచి చంద్రయాన్‌ వరకు"

Post a Comment