బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూపులు.

భర్త ఒక చోట.. భార్య మరోచోట


రెండేళ్లుగా బదిలీలకు నోచుకోని వైనం


ఒకే స్కూల్‌లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి


2020, 2021లలో జనగణన విధులు


దసరా సెలవుల్లో ట్రాన్స్‌ఫర్లు చేపట్టండి


సర్కారుకు ఉపాధ్యాయుల మొర


అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘భర్త ఒకచోట, భార్య మరోచోట పని చేస్తున్నాం. ఇబ్బందులు ఉన్నా నిబంధనల మేరకు ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తిచేశాం. డీఎస్సీ-2018 ద్వారా నియమితులైన వాళ్లు గత తొమ్మిదేళ్లుగా అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నాం. మా సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో ఖచ్చితంగా బదిలీలు చేపడతారని ఆశించాం. ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైనా, అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం మమ్మల్ని మాత్రం విస్మరించింది. 2017 ఆగస్టు తర్వాత ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇప్పటికైనా మాకు ట్రాన్స్‌ఫర్లు ఇవ్వండి’- అని రాష్ట్రంలోని వేలాది మంది ఉపాధ్యాయులు జగన్‌ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. రెండేళ్లుగా బదిలీలు చేపట్టని కారణంగా టీచర్లలో అలజడి నెలకొంది. ఈ విషయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం జగన్‌ను అడగాలని, ఆయన అంగీకరిస్తే దసరా సెలవుల్లో చేపడతామని ఆయన హామీ ఇచ్చినట్టు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ ఇప్పటి వరకు కార్యాచరణ ప్రకటించలేదు. దీంతో ఉపాధ్యాయులు ఆవేదనకు గురవుతున్నారు



20 వేల మంది ఎదురుచూపు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. తమ సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లికి వచ్చి వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబరు 5) రోజైనా ఆర్థిక భారం లేని బదిలీలు ప్రకటిస్తారని ఎదురు చూసినట్టు తెలిపారు. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో కూడా బదిలీలు చేపట్టే అవకాశం లేదని అంటున్నారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జన గణన(సెన్సెస్‌) ఉంటుందని.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. అలాగే 2021లోనూ జనాభా లెక్కల పరిశీలన విధులను ఉపాధ్యాయులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 28 నుంచి అక్టోబరు 10 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉన్నందున.. ఆ సమయంలో బదిలీలను ఆన్‌లైన్‌లో చేపట్టాలని ఫలితంగా విద్యార్థులకు, బోధనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు.

పోస్టుల ఖాళీలు తగ్గుతాయి

నెలవారీ పదోన్నతులు కల్పించడం వల్ల పాఠశాలల్లో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడు బదిలీలు చేపడితే ఉపాధ్యాయుల కొరత తీరుతుందని, తద్వారా విద్యార్థులకు బోధన సవ్యంగా సాగుతుందని కొందరు టీచర్లు అభిపాయ్రపడుతున్నారు. తాజాగా సబ్జెక్టు టీచర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని పని సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయంతో పని సర్దుబాటు అంశం పేపర్లకే పరిమితమైందని విమర్శిస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూపులు."

Post a Comment