వాట్సప్‌లో కొత్త ఫీచర్లు!




ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్‌ యాప్‌ దిగ్గజం వాట్సప్‌లో మరింత అధునాత ఫీచర్లను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే డార్క్‌ మోడ్‌పై కసరత్తు చేస్తున్న వాట్సప్‌ త్వరలోనే మరిన్ని ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని ఐఓఎస్‌, యాండ్రాయిడ్‌ బీటా వెర్షన్లలో ఇప్పటికే పరిశీలిస్తోంది.
ఒకే నంబర్‌తో పలు డివైజ్‌లలో.. 
ప్రస్తుతం ఒక ఫోన్‌ నంబరుతో ఒకే ఫోన్‌లో వాట్సప్‌ వాడే అవకాశముంది. ఇదే నంబరుతో మరో ఫోన్‌లో లాగిన్‌ అయ్యేందుకు వీలు లేదు. కేవలం వాట్సప్‌ వెబ్‌లో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఒకే నంబరుపై వివిధ డివైజ్‌లలో ఒకేసారి వాట్సప్‌ వాడుకొనేలా మార్పు చేస్తున్నారు

మొదట ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌లో అందుబాటులోకి తెచ్చి, తర్వాత ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో చేర్చనున్నారు.

గూగుల్‌ అసిస్టెంట్‌ నుంచి వాట్సప్‌ వాయిస్‌ కాల్స్‌ 
ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ అసిస్టెంట్‌ తెరిచి వాట్సప్‌ నుంచి వాయిస్‌, వీడియో కాల్‌ చేసుకొనే ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. మెసేజ్‌లు కూడా ఈ తరహాలోనే పంపుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్‌ అసిస్టెంట్‌ నుంచి కేవలం సాధారణ కాల్స్‌, డుయో ద్వారా వీడియో కాల్స్‌ చేసుకొనే ఫీచర్‌ మాత్రమే ఉంది. తాజా ఫీచర్‌ పొందేందుకు వాట్సప్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ రెండు యాప్‌లను అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది. 'హే గూగుల్‌' 'వాట్సప్‌ వీడియో' అని చెప్పి పలికి వీడియో కాల్‌ చేసుకోవచ్చు.

డెస్క్‌టాప్‌లోనూ ఆల్బమ్‌.. 
ప్రస్తుతం ఎవరైనా కొన్ని ఫోటోలు లేదా వీడియోలు పంపితే అవన్నీ ఛాట్‌ హిస్టరీలో ఒక ఆల్బమ్‌లా కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌ ప్రస్తుతం డెస్క్‌టాప్‌లో లేదు. ఒక ఫోటో కింద మరో ఫోటో వరుసగా కనిపిస్తున్నాయి. వాట్సప్‌ వెబ్‌లోనూ ఆల్బమ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.

ఐఫోన్‌ వినియోగదారుల కోసం వాట్సప్‌ ఆడియో ప్లే బ్యాక్‌ ఫీచర్‌ను తెచ్చింది. కొత్త వెర్షన్‌ 2.19.91.1లో ఇది అందుబాటులోకి రానుంది. ఎవరైనా వాట్సప్‌లో ఆడియో ఫైల్‌ పంపినప్పుడు దాన్ని నోటిఫికేషన్‌ బార్‌ నుంచే వినే సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకూ పంపిన ఆడియో లేదా వాయిస్‌ మెసేజ్‌లను యాప్‌ తెరిచి వినాల్సివస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సప్‌లో కొత్త ఫీచర్లు!"

Post a Comment