రూ.1.76 లక్షల కోట్లు

ప్రభుత్వానికి బదిలీకి ఆర్‌బీఐ బోర్డు ఆమోదం 
ఇదే ఇప్పటిదాకా అత్యధికం 
జలాన్‌ కమిటీ సిఫారసుల నేపథ్యం

ముంబయి: ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఓ వైపు ద్రవ్యలోటు పెరగకుండానే మరో వైపు మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాల్సిన తరుణంలో ప్రభుత్వానికి ఈ నిధులు అందుతున్నాయి. 2018-19 ఏడాదికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను బదిలీ చేయడానికి గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సోమవారమిక్కడ అనుమతి తెలిపింది


సవరించిన ఆర్థిక మూలధన ప్రణాళిక(ఈసీఎఫ్‌) ప్రకారం.. ఇందులో రూ.1,23,414 కోట్లు అదనపు నిధులు కాగా, రూ.52,637 కోట్లు అదనపు కేటాయింపులుగా గుర్తించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉద్దీపనకు మరింత అవకాశం 
ఆర్‌బీఐ ఎంత మేర మూలధన నిధులను ఉంచుకోవాలన్న దానిపై ఏర్పాటు చేసిన బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఈ అదనపు నిధుల బదిలీ జరిగింది. ఈ కమిటీలోని సభ్యుడు, ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ఆగస్టు 14న తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తాజాగా జరిగే ఈ నిధుల బదిలీ గట్టి దన్ను ఇవ్వనుంది. అయిదేళ్ల కనిష్ఠానికి చేరిన వృద్ధి రేటును మెరుగుపరచడంతో పాటు.. ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతం కంటే అధికం కాకుండా చూడడం కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం పలు చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ద్వారా వచ్చే నిధులతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉద్దీపన కల్పించడానికి ప్రభుత్వానికి వీలుకానుంది.

ఉర్జిత్‌ రాజీనామాకు కారణం ఈ నిధులే.. 
ఆర్‌బీఐ అదనపు నిధుల విషయంలో మోదీ ప్రభుత్వానికి, ఆర్‌బీఐ గత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు మధ్య తీవ్ర సంఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల్లో భాగంగా నవంబరు 2018 నాటి బోర్డు సమావేశంలో అదనపు నిధులను సమీక్షించడం కోసం ఆర్‌బీఐ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయమూ విదితమే. అయితే కమిటీ ఏర్పాటు కాకముందే ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా చేశారు. దీంతో కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో చర్చించిన మీదట డిసెంబరు 26న ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.

ఏ ఏడాది ఎంత? 
2013-14 నుంచే ఆర్‌బీఐ తన ఖర్చుచేయదగ్గ ఆదాయంలో 99 శాతాన్ని ప్రభుత్వానికి ఇస్తూ వస్తోంది. 
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల డివిడెండు వస్తుందని అంచనా వేయగా.. అంతకు మించి రూ.95,414 కోట్లు లభిస్తుండడం విశేషం. 
* ఆర్‌బీఐ నుంచి రూ.1.06 లక్షల కోట్ల మేర డివిడెండు లభించవచ్చని కేంద్ర బడ్జెట్‌ 2019-20లో అంచనా వేశారు. 
* అంతక్రితం ఏడాది రూ.74,140.37 కోట్లు వచ్చాయి. 
* ఇక 2017-18లో ఆర్‌బీఐ నుంచి రూ.40,659 కోట్లు డివిడెండు రూపంలో బదిలీ అయ్యాయి. అంతక్రితం ఏడాది అంటే పెద్ద నోట్ల రద్దు జరిగిన సంవత్సరం(2016-17)లో రూ.30,659 కోట్లు బదిలీ అయ్యాయి. 2015-16లో మాత్రం ఇంతకు రెట్టింపుగా రూ.65,876 కోట్లు చెల్లించింది.

కమిటీ ఏం పేర్కొందంటే..

కేంద్ర బ్యాంకులు ఊహించిన కొరత(ఈఎస్‌)ను విశ్వసనీయ స్థాయి(సీఎల్‌)లో 99 శాతంగా పరిగణిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దానిని 99.5 శాతంగా మార్చాలని కమిటీ సిఫారసు చేస్తోంది. ఆర్‌బీఐ తన పరపతి, ఆర్థిక, స్థిరత్వ నష్టభయాల కోసం కేటాయించే డబ్బులు.. దేశానికి అవసరమైనపుడు పనికి రావాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్లుగానే బ్యాలెన్స్‌ సీట్లు, పరపతి, ఆర్థిక స్థిరత్వ నష్టభయాలు, రుణ, కార్యకలాపాల నష్టభయాలకు కేటాయించాల్సిన వాటిపై సిఫారసులు చేసింది. ఈ సిఫారసులన్నీ సోమవారం నిర్వహించిన తన 578వ సమావేశంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు ఆమోద ముద్ర వేసింది. సవరించిన ప్రణాళిక ప్రకారం.. 2018-19 ఖాతాలను మారుస్తారు. కాగా, బోర్డు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు, ఆర్‌బీఐకి చెందిన వివిధ విభాగాల కార్యకలాపాలను బోర్డు సమీక్షించింది. అదే సమయంలో 2018-19 ఏడాదికి వార్షిక నివేదికను సైతం ఆమోదించింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • రూ.1.76 లక్షల కోట్లుప్రభుత్వానికి బదిలీకి ఆర్‌బీఐ బోర్డు ఆమోదం ఇదే ఇప్పటిదాకా అత్యధికం జలాన్‌ కమిటీ సిఫారసుల నేపథ్యంముంబయి: ప్రభుత్వానికి రూ.1.76 లక్ష… ...

0 Response to "రూ.1.76 లక్షల కోట్లు"

Post a Comment