ఉపాధ్యాయులకు బదిలీలు లేనట్లే!

ఉపాధ్యాయులకు బదిలీలు లేనట్లే! 
ఇది ముఖ్యమంత్రి నిర్ణయం : విద్యాశాఖ మంత్రి 
ఇప్పుడు బదిలీలు చేయకుంటే మరో రెండేళ్లు కష్టమే 
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి 
రాష్ట్రంలో 2017 తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు లేవు. కొత్త ప్రభుత్వం వచ్చాక బదిలీలు జరుగుతాయని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. ఎందుకంటే 2011లో బదిలీలు పొందిన ఉపాధ్యాయులంతా వారికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్లకు ఎనిమిదేళ్లు పూర్తయింది. లాంగ్‌ స్టాండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు బదిలీ అయితే దూర ప్రాంతాల్లో ఉన్నవారంతా ఆయా ప్రాంతాలకు బదిలీపై వెళ్లవచ్చని ఆశపడుతున్నారు

కానీ వారి ఆశలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విద్యా సంవత్సరం టీచింగ్‌ స్టాఫ్‌కు బదిలీలు లేవని తేల్చడంతో ఉపాధ్యాయులు డీలాపడ్డారు. ప్రస్తుతం విద్యాశాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. 
కర్నూలు జిల్లాలో ప్రతి సబ్జెక్టులో 30 నుంచి 50 మంది దాకా, హైస్కూలు హెడ్‌ మాస్టర్లకు 100 దాకా, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్‌ మాస్టర్లు 120 (అంటే ప్రైమరీ స్కూల్‌ హెఎంలు) దాకా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రమోషన్ల తర్వాత వీరి స్థానాలు ఖాళీ అవుతాయి. ఇవే కాకుండా గత రెండు నెలల్లో రిటైర్‌ అయిన వారి స్థానాలు ఖాళీలు కలిపి 700 దాకా ఉంటాయి. ఇవే కాకుండా 2011లో బదిలీ అయినవారికి ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరంతా ఖచ్చితంగా బదిలీ కావాల్సిందే. అలాంటి వారు 2వేలకు పైగా ఉన్నారు. ఇప్పుడు బదిలీ ప్రక్రియ మొదలెడితే ఈ ఖాళీలన్నీ అనుకూలమైన ప్రాంతాలు బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులకు అందుబాటులోకి వస్తాయి. 


వాస్తవానికి రెండు సంవత్సరాలు పనిచేస్తే చాలు బదిలీ కావచ్చు. 2017 తర్వాత బదిలీలు జరగలేదు. ఈ రెండు సంవత్సరాల మధ్య ఎలాంటి రిక్రూట్‌మెంట్‌ కూడా లేదు. అంతకు ముందు అంటే 2014లో నిర్వహించిన డీఎస్సీ ద్వారా 2016లో రిక్రూట్‌మెంట్‌ జరిగింది. 2017 తర్వాత బదిలీలు లేకపోవడంతో అందరికీ బదిలీ చేసుకునే అర్హత వచ్చింది. చాలామంది ఉపాధ్యాయులు బదిలీ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో 2018లో జరిగిన డిఎస్‌సి ద్వారా ఈ ఏడాది ఉద్యోగం పొందే కొత్త వారిని ప్రమోషన్లపై వెళ్లిన వారి ఖాళీల స్థానంలో నియమించనున్నట్లు సమాచారం. అలా చేస్తే బదిలీలు కోరుకుంటున్న వారికి అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం బదిలీలు నిర్వహించి తర్వాత మిగిలిన ఖాళీ స్థానాల్లో కొత్త వారిని పంపితే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 


ముఖ్యమంత్రి నిర్ణయం ఇలా : విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఉపాధ్యాయులకు బదిలీలు చేయడం కుదరదని ముఖ్యమంత్రి తేల్చారు. అన్ని డిపార్టుమెంట్లలో బదిలీలు ఉంటాయనీ, విద్యాశాఖలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు మాత్రమే బదిలీలు ఉంటాయనీ, ఉపాధ్యాయులకు ఉండవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1998 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు బదిలీల కౌన్సిలింగ్‌ జరిగింది. 2011 మినహా మిగతా అన్ని కౌన్సిలింగ్‌లు విద్యా సంవత్సరం మధ్యలోనే అంటే జులై నుంచి నవంబర్‌ వరకు జరిగిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలైంది. అందులో రెండు వారాలు ఒంటిపూట బడులే నిర్వహించారు. 

ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యా బోధన ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎలాగూ ప్రమోషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇదే సమయంలో బదిలీల ప్రక్రియ చేపట్టి అనంతరం డిఎస్‌సి ద్వారా కొత్త వారిని తీసుకుంటే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 


ఆందోళన పడే అంశం : విద్యాశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు చేపట్టకుంటే మరో రెండు సంవత్సరాలు బదిలీలు జరిగే అవకాశం లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం బదిలీలు చేయకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 వరకు విద్యా సంవత్సరం ఉంటుంది. వెంటనే 2020లో ఏప్రిల్‌ తర్వాత జనాభా లెక్కల పని మొదలవుతుంది. జనాభా లెక్కల పని ఉపాధ్యాయులదే

. ఏ ఊరిలో పనిచేసే ఉపాధ్యాయులు ఆ ఊరిలో జనాభా లెక్కలు (ఎన్యుమరేషన్‌ డ్యూటీ) చేయాలి. అప్పుడు కూడా బదిలీలు జరిగే 


అవకాశం ఉండదు. ఈ జనాభా లెక్కలు 2020 నుంచి 2021 ఏప్రిల్‌ వరకు జరుగుతాయి. అంటే మరో రెండేళ్లు బదిలీలు జరగవని ఉపాధ్యాయలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బదిలీలు జరగకపోతే బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులు 2021 వరకు ఆగాల్సిందే. బదిలీ గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి అడిగితే అది ముఖ్యమంత్రి నిర్ణయం అని ఆయన చేతులెత్తేశారు. 

ముఖ్యమంత్రి పునరాలోచించాలి : సురేష్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు
బదిలీలకు అయ్యే సమయం కేవలం పది రోజులే. అందుకు అయ్యే ఖర్చు ఏమీ లేదు. బదిలీ కోరుకుంటున్న ఉపాధ్యాయులు మరో రెండేళ్లు ఆందోళనతో బోధన చేయడం మంచిదా..? లేక కోరిన చోటికి బదిలీపై పోయి ప్రశాంతంగా విద్యా బోధన చేయడం మంచిదా.? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పునరాలోచించాలి. లేకుంటే రాష్ట్రంలో అడ్డదారి బదిలీలు (పైరవీ బదిలీలు) వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయ ఒత్తిళ్లతో సెక్రటేరియట్‌ నుంచి తమ వారికి బదిలీలు తెచ్చుకునే అవకాశం ఉంది. దాని వల్ల పోరాడి సాధించుకున్న కౌన్సిలింగ్‌ విధానానికి తూట్లు పొడిచినట్లవుతుంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "ఉపాధ్యాయులకు బదిలీలు లేనట్లే!"

  1. 8సంవత్సరాలు పూర్తి చేసిన వారు మారుమూల గ్రామాల్లో మగ్గవలసిందేనా?

    ReplyDelete