ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు



గత కొంతకాలంగా ఏపీకి కొత్త గవర్నర్‌ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

బిశ్వభూషణ్‌ రచయిత కూడా..

బిశ్వభూషణ్‌ ప్రముఖ న్యాయవాది. జనసంఘ్‌, జనతా పార్టీలో ఆయన పనిచేశారు. 1971లో భారతీయ జనసంఘ్‌ ద్వారా బిశ్వభూషణ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 1977లో జనతాపార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం భాజపాలో చేరిన ఆయన.. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగానూ ఆయన ఎన్నికయ్యారు. 



2004లో బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బిశ్వభూషణ్‌ రచయిత కూడా. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్‌, రాణా ప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాయన రాశారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన బిశ్వభూషణ్‌ చిలికా, భువనేశ్వర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌"

Post a Comment