రిటర్నులలో.. చేయొద్దు పొరపాట్లు..

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయమిది.. ఆదాయ గణనలోనూ.. మినహాయింపులు పొందడంలోనూ.. ఎలాంటి పొరపాట్లకూ తావీయకుండా.. వీటిని సమర్పిస్తే.. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన బాధ్యతను నిర్వహించిన వారమవుతాం.

సొం తంగా రిటర్నులు దాఖలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.


ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ తన ఈఫైలింగ్‌ వెబ్‌సైటులో దాదాపు పూర్తి చేసిన రిటర్నుల ఫారాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనం చేయాల్సిందల్లా.. అవన్నీ సరిగానే ఉన్నాయా.. లేదా కొన్ని మినహాయింపులను నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందా తనిఖీ చేసుకోవడమే. ఇక్కడే ఏదైనా పొరపాటు చేస్తే.. నోటీసు రావడానికి అవకాశం ఉంది.. ఆదాయాలను సరిగా గణించక తప్పులు చూపిస్తే.. పన్ను చెల్లింపుతోపాటు రుసుములూ ఉండవచ్చు.

ఏ ఫారంలో.. 
ఆదాయపు పన్ను శాఖ వివిధ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏడు రకాల ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నుల ఫారాలను అందిస్తోంది. వ్యక్తులకు లభించే ఆదాయాలను బట్టి ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వరకూ ఏ ఫారాన్ని ఎంచుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకూ వేర్వేరు ఫారాలు ఉంటాయి. ఐటీఆర్‌-1 లేదా సహజ్‌ ఫారంలో వేతనం, పింఛను, ఒక ఇంటి ద్వారా ఆదాయం లేదా ఇతర ఆదాయాలు ఉన్నవారు ఎంచుకోవాలి. మొత్తం ఆదాయం రూ.50లక్షల లోపు ఉంటేనే ఈ ఫారం వర్తిస్తుంది. కాబట్టి, మీ ఆదాయ వనరులు ఏమిటి? అనేది తెలుసుకున్నాకే.. సరైన ఫారాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఏ ఇబ్బందులూ ఎదురవ్వవు.

ఇల్లు ఉంటే... 
మీకు సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆ విషయాన్ని రిటర్నులలో పేర్కొనాలి. సొంతంగా నివాసం ఉంటున్నప్పుడు దానికి దానికోసం తీసుకున్న గృహరుణానికి చెల్లించే వడ్డీకి మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ దానిని అద్దెకు ఇచ్చినప్పుడూ దాని వివరాలు తెలియజేయాలి. ఇక్కడ.. మీరు అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. ఆ ఇంటికి చెల్లించే ఆస్తి పన్నును మినహాయింపు కింద చూపించుకోవచ్చు.

దీర్ఘకాలిక రాబడి... 
2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల నుంచి దీర్ఘకాలిక మూలధన రాబడి వచ్చినప్పుడు (ఎల్‌టీసీజీ) దానిని తప్పకుండా పేర్కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం లాభం రూ.లక్షకు మించినప్పుడు ఆ మించిన దానిపై 10శాతం పన్ను చెల్లించాలి. వీటికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడం మర్చిపోవద్దు. దీర్ఘకాలిక నష్టం ఉన్నా సరే.. పేర్కొనండి.

బ్యాంకు ఖాతా.. 
రిటర్నులు సమర్పించేప్పుడు బ్యాంకు ఖాతా వివరాలను కూడా తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అవి కచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోండి. ఐఎఫ్‌ఎస్‌సీ, ఖాతా వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ఖాతా వివరాల్లో తప్పులు దొర్లితే.. రిఫండు రావడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.


అన్ని ఆదాయాలూ కలపాలి...

ఒ కటికి మించిన ఆదాయాలు ఉన్నప్పుడు.. వాటన్నింటినీ కలిపి మొత్తం ఆదాయంగా చూపించాలి. చాలామంది పొరపాటు చేసేది ఇక్కడే. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతనం ద్వారా ఆదాయం వచ్చినప్పుడు దీంతోపాటు.. అద్దె ద్వారా వచ్చిన ఆదాయం, ఆస్తులు విక్రయించినప్పుడు వచ్చిన మూలధన పెట్టుబడులపై రాబడులు, వృత్తి, వ్యాపారం ద్వారా ఆదాయాలను ఆర్జించినప్పుడు, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఇవన్నీ కలిపి చూపించాలి. దీంతోపాటు మూలధన లాభం, డివిడెండ్లను ఆదాయాల నుంచి మినహాయింపులు పొందిన విషయమూ తెలియజేయాలి. ఆదాయాలు పూర్తిగా చూపించకపోతే.. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

ప్రస్తుతం ఉద్యోగులకు కొత్త విధానంలో ఫారం 16లు అందుతున్నాయి. ఇందులో ప్రతి వివరమూ చాలా స్పష్టంగా నమోదై ఉంటోంది. వచ్చిన ఆదాయం ఎంత, ఏయే మినహాయింపులు ఉన్నాయిలాంటివన్నీ విడివిడిగా ఇస్తున్నారు. రిటర్నులను నింపేటప్పుడు ఇందులో పేర్కొన్న ప్రతి వివరమూ సరిగా పూరిస్తున్నామా లేదా చూసుకోవాలి


వ్యక్తిగత వివరాలు... 
ఆదాయపు పన్ను రిటర్నుల ఫారంలో వ్యక్తిగత వివరాల్లో ఏ తప్పులూ లేకుండా చూసుకోవాలి. మీ చిరునామా, ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబరు తప్పుల్లేకుండా చూసుకోండి. పొరపాటు దొర్లితే.. ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్నులను తిరస్కరించవచ్చు. తప్పుడు సమాచారం ఇస్తే.. దీనివల్ల మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే సమాచారం సమయానికి అందకపోవచ్చు. ఇది పలు ఇబ్బందులకు దారి తీస్తుంది.



వెరిఫై చేయండి.. 
రిటర్నులు సమర్పించడమే కాదు.. దానిని ఈ-వెరిఫై చేయడం మర్చిపోకండి. నెట్‌ బ్యాంకింగ్‌, ఆధార్‌ ఓటీపీ ద్వారా ఈ-వెరిఫై చేయొచ్చు. లేదా అక్నాలజ్‌మెంట్‌ ప్రింట్‌ తీసుకొని, సంతకం చేసి, నేరుగా సీపీసీ, బెంగళూరుకు పోస్టులో పంపించే వీలూ ఉంది. ఏది చేసినా రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోగా పూర్తి చేయాలి.

- అర్చిత్‌ గుప్తా, సీఈఓ, ClearTax

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రిటర్నులలో.. చేయొద్దు పొరపాట్లు.."

Post a Comment