రూ. 40కు కుట్టేవారెవరు..
ఉంగుటూరు, నల్లజర్ల, న్యూస్‌టుడే
ఏకరూప దుస్తుల కుట్టు ఖర్చులు ఈ ఏడాది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి వారి ఖాతాల వివరాలను ఈ నెల 30లోపు సేకరించాలని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మూడు జతల ఏకరూప దుస్తులు సరఫరా చేయాల్సి ఉండగా...ఇప్పటికే ఒక జత పంపిణీ చేశారు. మరో రెండు జతలకు సంబంధించి కుట్టు ఖర్చు మొత్తం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఆప్కో సంస్థ ఫిబ్రవరి నెలాఖరు వరకు దుస్తులు సరఫరా చేయలేదు. దీంతో ఈ ఏడాది సంబంధిత వస్త్రాన్ని నేరుగా తల్లులకు అందించి, వారే కుట్టించుకోవాలని సూచించారు. ఖాతాలు లేనివారు ఇప్పటికిప్పుడు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
స్వల్ప మొత్తంతో కుట్టించుకునేదెలా..?
ఏకరూప దుస్తుల కుట్టు ఖర్చు కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.40 సరిపోతుందా అనేది ప్రశ్న. దీనికి తోడు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలి. అనేక మందికి బ్యాంకు ఖాతాలు లేవు. వచ్చే జనవరి నుంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని కోసం ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం వెంటనే బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలి
ఏకరూప దుస్తుల అందజేత
ఇదీ అర్హుల జాబితా..
జిల్లాలో మండల పరిషత్, ఉన్నత పాఠశాలలు 3,027, ఎయిడెడ్ పాఠశాలలు 271 ఉన్నాయి. వీటిలోని విద్యార్థులకు ఇప్పటికే ఒక జత ఏకరూప దుస్తులు సరఫరా చేశారు. మిగిలిన జతలకు సంబంధించి వస్త్రాన్ని పాఠశాల స్థాయిలో పంపిణీ చేసి కుట్టించుకునే బాధ్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పగించారు.
నిర్ణయం మంచిదైనా..
గతేడాది ఏకరూప దుస్తుల కొలతల విషయంలో తలెత్తిన సమస్య పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని అధికారులు అంటున్నారు. కానీ రూ. 40తో ఒక జత దర్జీలు కుడతారా..? అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు
ఖాతా సంఖ్యలు సేకరిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా సంఖ్యలను సేకరిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరానికి మూడు జతల ఏకరూప దుస్తులు ఇవ్వనున్నాం. జతకు రూ. 40 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. నాణ్యమైన దుస్తులు ఇవ్వాలని నిర్ణయించడం మంచిదే. జతకు రూ. 40 కుట్టుకూలి సరిపోదని, సరిపడా కూలీ ఇస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- దేశాబత్తుల సుభాకర్‌రావు, ఎంఈవో, ఉంగుటూరు
0 Response to "రూ. 40కు కుట్టేవారెవరు.."
Post a Comment