జులై 26 విజయ్ దివస్

జులై 26 విజయ్ దివస్ ...

19 ఏళ్ల కిందట సరిగ్గా జూలై 26న కార్గిల్‌లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉగ్రవాదుల ముసుగులో పాక్ పాల్పడిన అరాచక క్రీడను తిప్పికొట్టింది భారత సైన్యం. కశ్మీర్‌లో పాగా వేయాలనుకున్న పాక్ కుటిల ప్రయత్నానికి మన భారత జవాన్లు చెక్ పెట్టారు. పాకిస్తాన్‌ పై భారత్ సాధించిన గొప్ప చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ నాడు భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్నాం.




మూడు నెలల పాటు భారత జవాన్లు పాకిస్తాన్‌పై పోరాడారు. కశ్మీర్‌లో కొందరు ఉగ్రవాదులను పంపి ఆ హిమ ప్రదేశం తమదేనని ప్రపంచానికి చాటుకోవాలని చూసిన పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సరైన సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే 490 మంది అధికారులు, సైనికులు అమరులయ్యారు.

ఆపరేషన్ విజయ్‌ పేరుతో పాకిస్తాన్‌పై భారత బలగాలు సత్తా చూపాయి. ముందుగా యుద్ధం సమయంలో పాక్ చొరబాటు దారులను ఏరివేసి టైగర్ హిల్ ప్రాంతాన్ని భారత్ అధీనంలోకి తీసుకున్నాయి. 1971 యుద్ధం తర్వాత జరిగిన యుద్ధం కావడంతో ఇండియా పాకిస్తాన్ వార్‌ను ప్రపంచదేశాలు ఆసక్తితో తిలకించాయి. యుద్ధం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో జరిగినందున భారత జవాన్లు చాలా కష్టపడాల్సివచ్చింది.
అసలు యుద్ధం ఎలా వచ్చింది అనేది ఒకసారి చూస్తే... 1999వ సంవత్సరం మే మొదటివారంలో భారత భూభాగంలోకి కొందరు పాకిస్తాన్ నుంచి చొరబడినట్లు సమాచారం భారత అధికారులకు అందింది. చొరబడిన వారు ముజాహిద్దీన్ ఉగ్రవాదులై ఉంటారని అధికారులు తొలుత భావించారు. కానీ వారు ఉగ్రవాదులు కాదని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులుగా అధికారులు గుర్తించారు.
వారిని తరిమి కొట్టేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ విజయ్‌ను మొదలుపెట్టింది. కశ్మీర్ లడఖ్‌లను వేరు చేసి భారత బలగాలను సియాచిన్ గ్లేసియర్ నుంచి తరిమివేయాలనే ప్రణాళిక లేదా వ్యూహాన్ని పాక్ రచించింది.ఇలా చేయడం వల్ల ప్రపంచదేశాలు కూడా కశ్మీర్ సమస్యపై దృష్టి సారించి త్వరతగతిని ఒక పరిష్కారం చూపుతాయని పాక్ భావించింది.
ఇక యుద్ధానికి దిగాలంటే భారత్‌కు అన్నివైపులా కష్టాలు వెంటాడాయి. అలా అని భారత భూబాగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కశ్మీర్ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక అక్కడ ఉన్న రెండు జాతీయ రహదారులు కూడా నిత్యం రద్దీగా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి వాణిజ్యం వ్యాపారాలు జరగాలన్నా ఈ రహదారులే అత్యంత కీలకం. ఇక ఇదే భారత బలగాలకు దారి.
ఈ జాతీయ రహదారిపైకి పాకిస్తాన్ కాల్పులు జరిపింది. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో చాలా మంది పౌరులకు గాయాల య్యాయి. దీంతో అధికారులు మరో రహదారిని ఏర్పాటు చేసి పౌరులను ఆ రహదారి నుంచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ద్రాస్ సెక్టార్‌లో భారత బలగాలు ఆయుధాలతో పాటు మోహరించి ముందుగా అక్కడ నక్కి ఉన్న పాక్ బలగాలపై దాడి చేశారు. ఆ ప్రాంతాన్ని భారత బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.

ఇక అంతర్జాతీయ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో తమ బలగాలను విరమించుకుంది. ఇక జూలై చివరి వారంలో భారత బలగాలు చివరిసారిగా పాక్‌పై దాడి చేశాయి. ద్రాస్ సెక్టార్‌లో పాక్ బలగాలు వెనక్కు వెళ్లిపోయాయని నిర్ధారణ చేసుకున్నాక జూలై 26న భారత్ కాల్పులు విరమించింది.

యుద్ధంలో పాల్గొన్న భారత ఆర్మీ జవాన్లు, వీరమరణం పొందిన సైనికులను స్మరించుకునేందుకే ప్రతి ఏటా విజయ్ దివస్‌ను జరుపుతుంది ప్రభుత్వం.  దేశవ్యాప్తంగా ఆర్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.....
కె కె వి నాయుడు.


నేరుగా తలపడే ధైర్యం లేక దొడ్డిదారిన దురాక్రమణకు పాల్పడిన పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పి నేటికి సరిగ్గా 20 ఏళ్లయింది. మంచుకొండలపై మాటు వేసి దొంగ దెబ్బతీసి భారత్‌ను లొంగదీసుకోవాలన్న దుష్టపన్నాగాన్ని మన వీర జవాన్లు తిప్పికొట్టారు. పాక్‌ ఆక్రమించిన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. కార్గిల్‌ కొండలపై నాడు మన సైనికులు జరిపిన సమరం అసమానం. అమర జవాన్ల బలిదానం నిరుపమానం.

నాడు ఇదీ పరిస్థితి
నియంత్రణ రేఖ వెంబడి పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను ఇరు దేశాల సైనికులు ఏటా శీతాకాలానికి ముందు ఖాళీ చేసేవారు. 14వేల నుంచి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ శిబిరాల్లో అత్యంత శీతల వాతావరణం, మానవ మనుగడకు దుర్లభమైన పరిస్థితులు ఉండటంతో రెండు దేశాల మధ్య ఈమేరకు అవగాహన కుదిరింది.

పాక్‌ నమ్మకద్రోహం
1999లో ఈ పరిస్థితిని పాక్‌ సైన్యం సొమ్ము చేసుకుంది. శీతాకాలంలో భారత బలగాలు వైదొలగడంతో శత్రు సైనికులు ముష్కో, ద్రాస్‌, కార్గిల్‌, బతాలిక్‌, తుర్‌తుక్‌ సబ్‌సెక్టార్లలోకి చొరబడ్డారు. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో 4-10 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చారు. దాదాపు 130 భారత శిబిరాలను ఆక్రమించారు.

లక్ష్యం
శ్రీనగర్‌, లే మధ్య ఉన్న జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభింపచేయడం పాక్‌ సైనికాధికారుల లక్ష్యం. తద్వారా లద్దాఖ్‌, సియాచిన్‌కు భారత సైన్యం చేరలేని పరిస్థితిని కల్పించాలని వారు కుట్ర పన్నారు. తదనంతర పరిస్థితుల్లో కశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమానికి ఆజ్యం పోయాలని వ్యూహ రచన చేశారు. అంత ఎత్తయిన పర్వత ప్రాంతం నుంచి తమ సైనికులను భారత్‌ తరిమేయలేదని అతివిశ్వాసంతో నాటి పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ఈ కుట్ర పన్నారు. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం ‘లాహోర్‌ ప్రకటన’ చేసిన సమయంలోనే ముషారఫ్‌ ఈ కుట్రను అమలుపరిచారు.

ఎలా గుర్తించారు?
భారత సైన్యానికి చెందిన కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా నేతృత్వంలోని గస్తీ బృందం ద్రాస్‌ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా తొలి పోరాటం జరిగింది. పాక్‌ చొరబాటుదారులకు, భారత బృందానికి మధ్య కాల్పులు జరిగాయి. కాలియా బృందం వద్ద మందుగుండు సామగ్రి నిండుకుంది. దీంతో వారిని పాక్‌ సైనికులు నిర్బంధంలోకి తీసుకుని చిత్రవధ చేసి చంపేశారు. మరోవైపు పాక్‌ చొరబాట్లపై స్థానికులు నుంచి కూడా భారత సైన్యానికి సమాచారం అందింది. తొలుత చొరబాటుదారులను ఉగ్రవాదులుగా మన సైనిక ఉన్నతాధికారులు భావించారు.

పోరు ప్రారంభం
చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారత సైన్యం 1999 మే 3న ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. శత్రువు కాల్పులను కాచుకుంటూ, నిటారుగా ఉన్న పర్వతాలను మన సైనికులు అధిరోహించారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో భారీ ప్రాణ నష్టం తప్పలేదు. శత్రువుతో ముఖాముఖీ తలపడ్డాకే వారి గురించి మన సైన్యానికి తెలిసింది. వారిలో ఉగ్రవాదులతో పాటు, భారీగా ఆయుధాలు ధరించిన పాకిస్థాన్‌ సైనికులూ ఉన్నారని వెల్లడయింది. పటిష్ట బంకర్లలో ఉంటూ మన సైనికులపై కాల్పులు జరిపారు. అయినా మొక్కవోని ధైర్యంతో భారత సైనికులు పోరాడారు.
ఈ పోరాటంలో సంక్లిష్టత దృష్ట్యా మే 25న భారత వాయుసేన రంగంలోకి దిగింది. ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ పేరుతో చొరబాటుదారులపై వైమానిక దాడులకు ఉపక్రమించింది. మొట్టమొదటిసారిగా 32వేల అడుగుల ఎత్తు నుంచి పోరాటం చేయాల్సి రావడంతో తొలుత వాయుసేనకు ఎదురుదెబ్బలు తప్పలేదు. చొరబాటుదారులు ప్రయోగించిన చిన్నపాటి క్షిపణులకు తొలి రెండు రోజుల్లోనే మూడు యుద్ధవిమానాలు కూలాయి. దీంతో వైమానిక దళం తన వ్యూహాలను మార్చింది. అనేక వినూత్న విధానాలను తెరపైకి తెచ్చింది. మిరాజ్‌-2000 యుద్ధవిమానాల్లో మార్పులు చేర్పులు చేపట్టి పర్వత ప్రాంతంలో నక్కిన శత్రు సైనికులపై బాంబుల వర్షం కురిపించింది. మరోపక్క బోఫోర్స్‌ శతఘ్నులు గుళ్ల వర్షం కురిపించడంతో చొరబాటుదారులు కకావికలమయ్యారు. ఒకటి తర్వాత ఒకటిగా శిబిరాలు భారత వశమయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో పాక్‌ ప్రభుత్వం దారికొచ్చింది. మిగిలిన ఆక్రమణదారులను ఉపసంహరించుకుంది. ఈ పోరు 1999 జులై 26న అధికారికంగా ముగిసింది.

రక్తధారలు
ఈ పోరులో భారత్‌కు చెందిన 559 మంది సైనికులు వీర మరణం పొందారు. 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జులై 26 విజయ్ దివస్"

Post a Comment