వాట్సాప్ ఉపయోగించటం లో ముఖ్య కిటుకులు తెలుసుకోండి

వాట్సాప్‌ అంటే మెసేజ్‌లు పంపించడం... ఫొటోలు, వీడియోలు సెండ్‌ చేయడం... లేదంటే వీడియో కాల్స్‌ మాట్లాడుకోవడం. ఇదంతా వాట్సాప్‌ వినియోగం గురించి. వీటితోపాటు వాట్సాప్‌లో కిటుకులు, రక్షణ చర్యలు లాంటివీ ఉంటాయి. వాట్సాప్‌ వాడుతున్న చాలామంది వీటి గురించి పెద్దగా తెలియదు. అందుకే ఈ రోజు వాట్సాప్‌లో చిన్నకిటుకులు చెబుతున్నాం. వాటితో మీరు ఇకపై మరింత జాగ్రత్తగా వాట్సాప్‌ను యూజ్‌ చేయొచ్చు.


హిస్టరీ డిలీట్‌

వాట్సాప్‌లో ఛాట్‌లో వ్యక్తిగత విషయాలు ఉన్నప్పుడు డిలీట్‌ చేయటం మంచిది. దీని కోసం సెట్టింగ్స్‌ -> ఛాట్స్‌ -> ఛాట్‌ హిస్టరీ -> డిలీట్‌ ఆల్‌ ఛాట్స్‌లోకి వెళ్లి డిలీట్‌ చేసేయొచ్చు. ఈ క్రమంలో మీ స్టేటస్‌ అప్‌డేట్లు, గ్రూప్‌లోని ఛాట్స్‌ డిలీట్‌ అవుతాయి. కేవలం ఓ వ్యక్తి లేదా గ్రూపులో చేసిన ఛాట్‌ డిలీట్‌ చేయాలంటే చాట్‌ విండోలో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి మోర్‌లోకి వెళ్లి క్లియర్‌ ఛాట్‌ ఉపయోగించాలి. అయితే డిలీట్‌ ఆల్‌ విధానంలో చేసేటప్పుడు 'డిలీట్‌ మీడియా ఫ్రమ్‌ మై ఫోన్‌' అనే ఆప్షన్‌కు టిక్‌ తీసేయాలి. లేకుంటే అప్పటి వరకు గ్యాలరీలో సేవ్‌ అయిన ఫొటోలు, వీడియోలు ఛాట్‌ హిస్టరీతోపాటు డిలీట్‌ అవుతాయి


అకౌంట్ ఇన్ఫో

వాట్సాప్‌లో మనం ఏ సమాచారం ఇచ్చాం, కాంటాక్ట్స్‌, బ్లాక్‌ చేసిన నెంబర్లు... ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆప్షన్‌ ఉంది. దీని కోసం వాట్సాప్‌లో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్‌ వస్తుంది. క్లిక్ చేసి అకౌంట్‌పై టాప్ చేస్తే రిక్వెస్ట్‌ అకౌంట్ ఇన్ఫో వస్తుంది. మనం రిక్వెస్ట్ చేసిన 3 రోజులలో వాట్సాప్ మన ఖాతాకు సంబంధించిన రిపోర్ట్‌ను అక్కడ చూపిస్తుంది. దీనిలో మన ఖాతాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఫోన్ నంబర్‌, మెయిల్ ఐడీ, ఫోన్ మోడల్‌, ఓఎస్ వెర్షన్‌, కాంటాక్ట్స్‌, ఐపీ అడ్రస్‌, స్టేటస్ ప్రైవసీ, బ్లాక్ చేసిన నంబర్లు అన్ని చూసుకోవచ్చు.


మీడియా విజిబులిటీ

వాట్సాప్ వినియోగదారులు రోజువారీ గ్రూపుల్లో వందల కొద్ది ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. అవి మీ ఫోన్‌లోని గ్యాలరీలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. అంతేనా మీ గ్యాలరీలోనూ కనిపిస్తుంటాయి. ఇది కాస్త చికాకు తెప్పించే విషయమే. దీని నుంచి విముక్తి కావాలంటే సెట్టింగ్స్ -> ఛాట్స్ -> మీడియా విజిబులిటీలోకి వెళ్లాలి. అక్కడ డిజేబుల్‌ చేసుకుంటే మీరు ఇక నుంచి వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలు గ్యాలరీలో కనిపించవు. కానీ మీ మొబైల్‌లో సేవ్‌ అయి ఉంటాయి


మెసేజ్‌కి రిప్లై

గ్రూప్‌, ఛాట్‌లో ఎవరి మెసేజ్‌కైనా సమాధానం ఇచ్చేటప్పుడు... అది దేని గురించో చెప్పడం మంచిది. అందుకే రిప్లై ఇచ్చినప్పడు ఆ మెసేజ్‌ను కోట్ చేస్తే సరి. దీని కోసం ఇప్పటివరకు ఆ మెసెజ్‌ని సెలక్ట్ చేసి రిప్లై బటన్ నొక్కి ఇవ్వాల్సి వచ్చేది. ఇటీవల వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను మరింత సులభతరం చేసింది. కేవలం ఆ మెసేజ్‌ను కుడి వైపునకు లాగితే ఆటోమేటిక్‌గా కోట్ అవుతుంది. అందులో మీ సందేశాన్ని టైప్ చేస్తే చాలు


సెకండ్‌ స్టెప్‌

ఏ ఫోన్‌లో వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినా ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలు. ఇదే అవకాశంగా మోసగాళ్లు మన నెంబర్‌తో వేరే చోట ప్రయత్నించే అవకాశం ఉంది. దీనికి విరుగుడు సెకండ్‌ స్టెప్‌ వెరిఫికేషన్‌. దీనికోసం వాట్సాప్‌లో సెట్టింగ్స్‌ -> అకౌంట్‌ -> టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ -> ఎనేబుల్‌ చేయాలి. అలా ఎనేబుల్‌ చేసినప్పుడు 6 అంకెల పిన్‌ నెంబర్‌ను, మెయిల్‌ ఐడీని రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వాట్సాప్‌ రీ ఇన్‌స్టాల్‌ చేయడం లేదా కొత్త మొబైల్‌కి మారినా 6 అంకెల పిన్‌ ఎంటర్‌ చేస్తేనే వాట్సాప్‌ ఓపెన్‌ అవుతుంది. సాధ్యమైనంత వరకు బాగా గుర్తుండే అంకెలనే పిన్‌ నెంబర్‌గా పెట్టుకోవాలి. ఒకవేళ మరచిపోయినా ఫర్‌గెట్‌ ఆప్షన్‌ ద్వారా ఈమెయిల్‌ ఐడీకి వచ్చే ఓటీపీతో రీసెట్‌ చేసుకోవచ్చు.


ప్రైవేట్‌ రిప్లై

గ్రూప్‌లో ఛాట్‌ చేస్తున్నప్పుడు ఎవరికైనా ప్రైవేట్‌గా రిప్లై ఇస్తే అది గ్రూపులో అందరికీ కనిపిస్తుంది. పోనీ బయటకు వచ్చి... రిప్లై ఇస్తే అవతలి వ్యక్తి ఏం అన్నారు.. దానికి మీరేమంటున్నారు అని రాయాలి. ఈ ఇబ్బంది లేకుండా వాట్సాప్‌ ఇటీవల కొత్త ఆప్షన్‌ తెచ్చింది. అదే 'రిప్లై ప్రైవేట్లీ'. దీని ద్వారా గ్రూప్‌ నుంచి బయటకు రాకుండానే ఆ మెసేజ్‌ రాసిన వ్యక్తికి రిప్లై ఇవ్వవచ్చు. దీనికోసం మీరు రిప్లై ఇవ్వాల్సిన మెసేజ్పై లాంగ్‌ ప్రెస్‌ చేసి కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే రిప్లై ప్రైవేట్లీ అని కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసి ఆ మెసేజ్‌ రాసిన వ్యక్తికి సమాధానం ఇవ్వొచ్చు. మీరు ఇచ్చిన రిప్లైతో పాటు అవతలి వ్యక్తి రాసిన మెసేజూ కనిపిస్తుంది


అందరికి కాదు.. కొందరికే

వాట్సాప్‌ స్టేటస్‌ షేర్‌ చేసింది మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో వాళ్లందరూ చూసే అవకాశం ఉంది. అలా కాకుండా కేవలం ఎంపిక చేసుకున్నవారికే కనిపించేలా స్టేటస్‌లను సెట్‌ చేయవచ్చు. దీని కోసం స్టేటస్‌ ట్యాబ్‌లోని స్టేటస్‌ ప్రైవసీలోకి వెళ్లండి. అక్కడ మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో 'ఓన్లీ షేర్‌ విత్‌' ఆప్షన్‌లో మనం ఎవరిని ఎంపిక చేస్తే వారే మన స్టేటస్‌ చూడగలరు. అలా కాకుండా ఫోన్‌ కాంటాక్ట్స్‌లోని కొద్ది మందిని స్టేటస్‌ చూడకుండా మినహాయించాలంటే 'మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌' ఎంచుకొని కాంటాక్ట్‌లను ఎంపిక చేస్తే వారు మాత్రమే మీ స్టేటస్‌లను చూడలేరు. ఎప్పటిలా అందరూ స్టేటస్‌లు చూడాలంటే 'మై కాంటాక్ట్స్‌'కి మార్చుకోవాలి


పర్మినెంట్‌ డిలీట్‌

మీ కొత్త నెంబరుతో వాట్సాప్‌ను ప్రారంభించారు... అయితే పాత వాట్సాప్‌ అకౌంట్‌ అలానే ఉంటుంది. దాన్ని వాడక పోయినా ఇతరుల వాట్సాప్‌లో ఆ పాత నెంబరు వాట్సాప్‌ లిస్ట్‌లో కనిపిస్తుంటుంది. అలా కనిపించొద్దు అనుకుంటే వాట్సాప్‌ అకౌంట్‌ను పర్మినెంట్‌గా డిలీట్‌ చేయటమే మార్గం. దీనికోసం సెట్టింగ్స్ -> అకౌంట్‌ -> డిలీట్‌ మై అకౌంట్‌లోకి వెళ్లండి. అక్కడ వాట్సాప్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి 'డిలీట్‌ మై అకౌంట్‌'పై క్లిక్‌ చేయాలి. తర్వాత స్క్రీన్‌పై డిలీట్‌కు కారణం అడుగుతూ ఆప్షన్లను చూపిస్తుంది. అందులో ఒకటి ఎంపిక చేసుకుని డిలీట్‌ మై అకౌంట్‌ క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా శాశ్వతంగా డిలీట్‌ అయిపోతుంది. అప్పటివరకు ఉన్న ఛాట్‌ హిస్టరీ, డేటా ఇక తిరిగిరాదు


వాల్‌పేపర్‌గ

వాట్సాప్‌ ఛాట్‌ స్క్రీన్‌ బ్యాగ్రౌండ్‌గా ఎప్పుడూ ఆ పచ్చ రంగేనా అనుకుంటున్నారా... అయితే మీరు సెట్టింగ్స్‌లోని వాట్‌పేపర్‌ ఆప్షన్‌ను చూడలేదన్నమాట. వాట్సాప్‌ ఛాటింగ్‌ స్క్రీన్‌ బ్యాగ్రౌండ్‌లో నచ్చిన ఫొటోలను పెట్టుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌ -> ఛాట్స్‌ -> వాల్‌పేపర్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ ఫోన్‌ గ్యాలరీ నుంచి నచ్చిన ఫొటోను బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేలా చేయవచ్చు.

ఇలా అడ్డుకోవచ్చు

ఈ గ్రూపు ఎవరిద్దబ్బా... నన్నెందుకు యాడ్‌ చేశారు? ఇలా మీరూ ఎన్నోసార్లు అనుకునే ఉంటారు. నచ్చకపోతే బయటకు వచ్చేసే ఉంటారు. అలా ఎన్నిసార్లు ఎగ్జిట్ అయినా తిరిగి చేర్చుతూనే ఉంటారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎవరుపడితే వారు మిమ్మల్ని గ్రూపులో యాడ్‌ చేయకుండా చూసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్ -> అకౌంట్ -> ప్రైవసీ -> గ్రూప్స్‌లోకి వెళ్లండి. అక్కడ ఎవ్రీబడీ, కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లు ఉంటాయి. ఎవ్రీబడిలో ఉంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో చేర్చవచ్చు. కాంటాక్స్ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే కేవలం మీ ఫోన్‌బుక్‌లో ఉన్నవారు మాత్రమే గ్రూప్‌లో చేర్చగలరు. 'నోబడీ'ని ఎంపిక చేసుకుంటే ఎవరూ మిమ్మల్ని ఏ గ్రూప్‌లోనూ చేర్చలేరు

గ్రూప్‌ నోటిఫికేషన్లను మ్యూట్‌ చేయడం

వాట్సాప్‌ వినియోగదారులకు గ్రూప్‌ నోటిఫికేషన్లు తలనొప్పిగా మారాయి. తెలియనివారు వారు గ్రూప్‌లో వరుస పోస్టులు పెడుతుంటారు. పెట్టొద్దు బాబోయ్‌ అన్నా వినరు. అలాంటప్పుడు ఆ గ్రూపును మ్యూట్‌ చేసేస్తే సరి. దీని కోసం గ్రూప్‌లోకి వెళ్లి కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మ్యూట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానికి క్లిక్‌ చేస్తే 8 గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం ఆప్షన్లు వస్తాయి. వాటిలో మీరు ఎంపిక చేసుకునే దాని ప్రకారం... అన్ని రోజుల పాటు ఆ గ్రూప్‌ నోటిఫికేషన్లు మీకు వినిపించవు. కానీ అందులో కొత్తగా సందేశాలు వచ్చిన విషయం నెంబర్ల రూపంలో కనిపిస్తుంది. మ్యూట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసిన తర్వాత కింద షో నోటిఫికేషన్‌లో టిక్‌ మార్క్‌ తీసేయడం మరచిపోవద్దు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్ ఉపయోగించటం లో ముఖ్య కిటుకులు తెలుసుకోండి"

Post a Comment