ఏపీ మ్యాప్ మారిపోతోంది... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల లెక్కలివే

 విభజన జరిగాక రెండు రాష్ట్రాల మ్యాప్ మారిపోయింది. ఇప్పటికే తెలంగాణను సీఎం కేసీఆర్ ఏకంగా 33 జిల్లాలుగా విభజించేశారు. అక్కడ కావాల్సినన్ని రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు, మండలాలు, కమిషనరేట్లు, కార్పొరేషన్లు వచ్చేశాయి. ఇక ఇప్పుడు ఏపీ మ్యాప్ మారబోతోంది. తెలంగాణ నుంచి ఏపీలో విలీనం అయిన ఏడు మండలాలతో ఏపీ మ్యాప్ కాస్త చేంజ్ అవ్వగా ఇప్పుడు ఏపీలో కూడా తెలంగాణలోలా కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు రానున్నాయి. ఏపీలో ఇప్పటికే కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై అనేక డిమాండ్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

ఏపీలో పరిపాలనా సౌలభ్యం కోసం, సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కొత్త జిల్లాలు, డివిజిన్లు, మండలాల ఏర్పాటు అంశంపై చర్చ నడుస్తోంది


వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి రాగానే ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వం ఎవరిది అయినా ఆ ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీలో పాలన ప్రజలకు మరింత చేరువు చేయాలంటే కనీసం 75కిపైగా రెవెన్యూ డివిజన్లు, 700లకుపైగా మండలాలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. 

అయితే ఈ డివిజన్లు, మండలాల పునర్విభజన చేయాలంటే ముందుగా జిల్లాల విభజన జరగాలి. జిల్లాల పునర్విభజనపై టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులు ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. ఇక ఈ అంశం మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాల నుంచి తెప్పించుకున్న నివేదికలను అధ్యయనం చేస్తున్నారు. కొత్త డివిజన్ల విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో గుంటూరు, తెనాలి, నరసరావుపేట, గురజాల డివిజన్లు ఉండగా, బాపట్లను రెవెన్యూ డివిజన్‌గా, మరో 3 మండలాలను నెలకొల్పాలని ప్రణాళికలు రూపొందించారు. ఇక కడప జిల్లాలో కడప, జమ్మలమడుగు, రాజంపేట డివిజన్లు ఉండగా బద్వేలును డివిజన్‌గా, 2 గ్రామీణ మండలాలను ఏర్పాటు చేయాలంటున్నారు.

కృష్ణాలో ఇప్పటికే ఉన్న గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ డివిజన్లు ఉండగా, నందిగామను కూడా రెవెన్యూ డివిజన్‌ను చేయాలన్న ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. ఇక్కడ కొత్తగా 3 మండలాలను తీసుకురావాలన్నడిమాండ్‌ ఉంది. కర్నూలు జిల్లాలో కొత్తగా ప్రత్తికొండ, ఆత్మకూరు డివిజన్లు, నెల్లూరు జిల్లాలో కొత్తగా మూడు మండలాల ఏర్పాటు, ప్రకాశం జిల్లాలో మార్టూరు, దర్శి డివిజన్లు తెరమీదకు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, విజయనగరం జిల్లాలో నాలుగు కొత్త మండలాలతో పాటు చీపురుపల్లి, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.

ఇక విశాఖ జిల్లాల్లో చింతపల్లి, చోడవరం డివిజన్ల ఏర్పాటుతో పాటు పశ్చిమగోదావరిలో మూడు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గానిదే తుదినిర్ణయం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకే దీనిపై కసరత్తు జరుగుతుంది. ఇక అనంతో గుంతకల్‌, చిత్తూరులో శ్రీకాళహస్తి, కుప్పం, తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఉన్న 7 డివిజన్లను మార్చి వీటి సంఖ్య పెంచాలని చూస్తున్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ మ్యాప్ మారిపోతోంది... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల లెక్కలివే"

Post a Comment