ఎల్‌ఐసీ రుణం ఇక చాలా సులువు
*ఎల్‌ఐసీ రుణం ఇక చాలా సులువు*
*అంతా ఆన్‌లైన్‌లోనే..*
కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు
భారత జీవితబీమా(ఎల్‌ఐసీ పాలసీదారులు) రుణం ఇప్పుడు చాలా సులువు. పాలసీ బాండ్లపై ఆన్‌లైన్ ద్వారా రుణసౌకర్యాన్ని సంస్థ అమలులోకి తెచ్చింది. గతంలో పాలసీదారుడు రుణం కావాలంటే బాండ్లు పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇంట్లో నుంచే రుణం పొందేందుకు ఎల్‌ఐసీ అవకాశం కల్పించింది.
ఎలాగంటే..
ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి www.licindia.in లోకి లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ సర్వీసెస్ కాలమ్‌లో ఆన్‌లైన్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కస్టమర్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి. అంతకుముందే ఎల్‌ఐసీలో ఆన్‌లైన్ సేవలు పొందుతుంటే వివరాలు ఇచ్చి ముందుకు సాగాలి. కొత్తగా రుణం తీసుకోవాలనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ వద్ద సైన్ అప్ క్లిక్ చేసి అక్కడున్న వివరాలు పూర్తి చేసి ముందుకు సాగాలి. ఇప్పటికే రుణం తీసుకుని వడ్డీ, అసలు చెల్లించాలనుకునే వారికోసం మరో ఆప్షన్ ఈ పేజీలో కనిపిస్తుంది. రుణంకోసం దాఖలు చేసుకుంటే పాలసీదారుడు బ్యాంకు ఖాతాలో రుణం జమ అవుతుంది. ఎల్‌ఐసీ బాండ్ స్వాధీనపరిస్తే ఎంతైతే వస్తుందో అందులో 90శాతం రుణం లభిస్తుంది. పెయిడ్‌అప్ పాలసీలైతే 85శాతం రుణం మంజూరు చేస్తారు.
ఈ తరహా రుణాలపై ఎల్‌ఐసీ పదిశాతం వడ్డీ వసూలు చేస్తుంది. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తూ పాలసీ గడువు ముగిసే వరకు అసలు చెల్లించకుండా రుణాలు సాగించుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే మొత్తం నుంచి ఎల్‌ఐసీ అసలును మినహాయించుకుంటుంది లేదా పాలసీదారుడు మరణిస్తే పరిహారం నుంచి తగ్గించుకుంటుంది. ఒకవేళ వడ్డీ కూడా చెల్లించకుంటే మాత్రం పాలసీని ముందే టెర్మినేట్ చేసే హక్కు సంస్థకు ఉంది.
రుణం తీసుకున్న తర్వాత ఆరు నెలల లోపే పాలసీదారుడు మరణిస్తే లేదా కాల వ్యవధి తీరితే అప్పటి వరకే వడ్డీని ఎల్‌ఐసీ లెక్కకడుతుంది. రుణం తీసుకోవాలంటే పాలసీ తీసుకుని కనీసం మూడేళ్లు పూర్తయ్యి సరెండర్ వాల్యూ కలిగి ఉండాలి. పాలసీ బాండును ఎల్‌ఐసీ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పాలసీదారుడి అర్హతను బట్టి అదే పాలసీపై రెండో రుణం తీసుకోవచ్చు.
0 Response to "ఎల్‌ఐసీ రుణం ఇక చాలా సులువు"
Post a Comment