కొత్త జిల్లాలఅభ్యంతరాలకు గడువుకు మరో 4 రోజులే !
సాలూరు రూరల్, ఫిబ్రవరి 27: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలకు గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజులే సమయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మార్చి 3 తేదీలోగా అభ్యంతరాలు చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటుందా? లేక ఏకపక్షంగా వెళ్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా మన్యం జిల్లా పేరుపై అత్యధికులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ విషయమై కొందరు రాత పూర్వకంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతులు సమర్పించారు. జిల్లా సమీక్షా సమావేశంలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు స్వయంగా మంత్రికి పేరుపై అభ్యంతరం చెప్పారు. పార్వతీపురంలో జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నారు. పార్వతీపురం జిల్లాగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. మన్యం జిల్లాలో కలపడంపై పాలకొండలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉండడానికే పాలకొండ నియోజకవర్గ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎస్.కోటను విశాఖలో విలీనం చేయాలనే డిమాండ్ ఉంది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారో? లేదో వేచిచూడాలి. ఇప్పటికే మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో కార్యాలయాల ఏర్పాటులో యంత్రాంగం తలమునకలై ఉంది. అధికారులు ప్రభుత్వ, అద్దె భవనాలను గుర్తించారు. కొత్త జిల్లాలు ఏప్రిల్ 2 నుంచి ఏర్పాటు కానున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై వచ్చే మార్చి 10న తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యంతరాలకు విలువ ఉంటుందో లేదోనని పలువురు అసక్తిగా ఎదురు చూస్తున్నారు
0 Response to "కొత్త జిల్లాలఅభ్యంతరాలకు గడువుకు మరో 4 రోజులే !"
Post a Comment