2022-23 నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేయండి  ప్రైవేటులో 25% సీట్లు పేద విద్యార్థులకే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సీ) మేరకు ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు 25ు సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టం అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంతో పాటు కోర్టు ధిక్కరణ కేసులను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25ు సీట్లు ఉచితంగా భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యేగేశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు విద్యాహక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్‌ అఫిడవిట్‌ వేశారు. రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేస్తామని, చట్టంలోని సెక్షన్‌ 12(1)(సీ) మేరకు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25ు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా న్యాయవాది తాండవ యేగేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఏటా లక్షలమంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. ఆర్టీఈ చట్టం అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ.. 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. 2022-23 నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు కేంద్రం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అనుసరించాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారం పై ఇప్పటికే అఫిడవిట్‌ వేశామని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2022-23 నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేయండి  ప్రైవేటులో 25% సీట్లు పేద విద్యార్థులకే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం"

Post a Comment