ఫిబ్రవరి 15కల్లా మూడోవేవ్ పతాకస్థాయికి
న్యూఢిల్లీ, జనవరి 8 : దేశంలో కరోనా కేసులు లక్షల్లో పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఆర్-నాట్ వ్యాల్యూ (రీ ప్రొడక్షన్ -ఫ్యాక్టర్) కూడా పైపైకి వెళుతోంది. కొత్త ఏడాది మొదటి వారం రోజుల (జనవరి 1 - 6) వ్యవధిలో ఆర్-నాట్ వ్యాల్యూ ఏకంగా 4కు పెరిగింది. అంతకుముందు వారం (డిసెంబరు 25-31)లో ఇది 2.9 మాత్రమే. కంప్యూటేషనల్ అధ్యయనంలో ఈ అంశాలను గుర్తించినట్లు ఐఐటీ మద్రాస్ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా వెల్లడించారు. ఈ లెక్కన కరోనా మూడోవేవ్ కేసుల సంఖ్య ఫిబ్రవరి నెల మొదటి రెండు వారాల్లోగా పతాక స్థాయికి పెరగొచ్చని ఆయన హెచ్చరించారు. ప్రజలు భౌతికదూరాన్ని పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతుండటంతో పాటు మునుపటి తరహా కొవిడ్ ఆంక్షలు ప్రస్తుతం అమల్లో లేనందున ఈసారి రెండో వేవ్ కంటే ఎక్కువగా కేసుల ఉధృతి ఉండొచ్చని విశ్లేషించారు.
అయితే దేశ జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ జరగడం ఒక్కటే సానుకూల అంశంగా ఉందని పేర్కొన్నారు. కొవిడ్ వంటి సాంక్రమిక వ్యాధుల వ్యాప్తి రేటుపై అంచనాకు వచ్చేందుకు ‘ఆర్-నాట్ వ్యాల్యూ’ను వినియోగిస్తారు. ఇన్ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్ సోకుతోందనే దాని ఆధారంగా ఆర్-వ్యాల్యూను నిర్ధారిస్తారు. ఐఐటీ మద్రాస్ తాజా విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆర్-నాట్ వ్యాల్యూ 4. అంటే.. కొవిడ్ సోకిన ప్రతి ఒక వ్యక్తి నుంచి సగటున నలుగురికి వైరస్ ప్రబలుతోందన్న మాట. కరోనా వ్యాప్తి వేగం ఎంతలా పెరిగిందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. వారం క్రితమే ఢిల్లీ, ముంబై నగరాల్లో ఆర్-ఫ్యాక్టర్ 2 దాటగా, పుణె, కోల్‌కతా, బెంగళూరుల్లో 1 దాటిందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
కేసులు చూసి కంగారొద్దు: డాక్టర్ విద్యాసాగర్
దేశంలో కొవిడ్ వ్యాప్తి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో కరోనా మహమ్మారి ఏ మలు పు తీసుకోనుంది? ఈ అంశాలపై అంచనాలతో శాస్త్రీయ నివేదికను రూపొందించేందుకు ప్రధాని మోదీ ‘జాతీయ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. దీనికి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్ నేతృత్వం వహి స్తారు. ప్రస్తుతం దేశంలో లక్షలాది కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విద్యాసాగర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కరోనా కొత్త కేసులను చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని విద్యాసాగర్ వ్యాఖ్యానించారు. ‘‘వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఎక్కువ మందికి కొవిడ్‌ను కలిగిస్తోంది. అంతే తప్ప.. దాని వల్ల చాలామందికి తీవ్ర ఇన్ఫెక్షన్లు ప్రబలడం లేదు. ఈ నేపథ్యంలో భారీగా నమోదవుతున్న కొత్త కరోనా కేసులకు ప్రాధాన్యమేం ఉండదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడం అసాధ్యమన్నారు
0 Response to "ఫిబ్రవరి 15కల్లా మూడోవేవ్ పతాకస్థాయికి"
Post a Comment