కఠిన నిబంధనలు అమల్లోకి.. ఇకపై అలాంటి వేషాలు కుదరవు!
Twitter New Rules 2021: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోనుంది.
ట్విటర్ కొత్త పాలసీ నవంబర్ 30, 2021 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించుకుంది. ఒక యూజర్ లేదంటే అథారిటీ కావొచ్చు.. అవతలి వాళ్ల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాంటి పోస్టుల మీద గనుక ఫిర్యాదులు అందితే.. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది ట్విటర్ . అయితే..
ఇదివరకే ట్విటర్‌లో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, మెడికల్‌బిల్లులు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, జీపీఎస్ లొకేషన్, గుర్తింపు ఐడెంటిటీ కార్డులు, మెడికల్ రికార్డులు.. ఇలాంటి సమాచారం ట్విటర్‌లో షేర్ చేయడానికి వీల్లేదు. వీటికి తోడు ఫైనాన్షియల్ ట్రాన్‌జాక్షన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం కూడా ఉల్లంఘనే అవుతుంది.
ఇక కొత్త పాలసీ అప్‌డేట్ ప్రకారం.. పబ్లిక్ ఫిగర్స్, ప్రజా ప్రయోజనాల కోసం ఇతరులకు(నాన్ సెలబ్రిటీస్) సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. కానీ, అవి అభ్యంతరకరంగా ఉండి.. ఫిర్యాదులు అందితే మాత్రం వాటిని కూడా ట్విటర్ పరిశీలించి మరీ తొలగిస్తుంది. చర్యల్లో భాగంగా వ్యవహారం తీవ్రతను బట్టి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయడమో లేదంటే పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విటర్ తెలిపింది.
అమెరికాలో పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి.. ట్విటర్‌లో అనుమతులు లేకుండా పోస్ట్ చేయడంలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఇక యూరోపియన్ చట్టాలు మాత్రం.. ఇలా ఫిర్యాదులు అందితే ఫొటోలు, వీడియోలను తొలగించేందుకు ఎప్పటి నుంచో అనుమతిస్తున్నాయి. అయితే యూజర్ల వ్యక్తిగత భద్రతను (Privacy) కాపాడేందుకు.. ఆయా దేశాల చట్టాలను అనుసరించి ఈ అప్‌డేట్ తీసుకొచ్చినట్లు ట్విటర్ ప్రకటించుకుంది. ట్విటర్‌లో ప్రైవసీ నిబంధనల అమలు అసలు ఉంటుందా? అనే అనుమానాలకు ట్విటర్ పైవిధంగా క్లారిటీ ఇచ్చింది
0 Response to "కఠిన నిబంధనలు అమల్లోకి.. ఇకపై అలాంటి వేషాలు కుదరవు!"
Post a Comment