ఉద్యోగుల నామినీకే ‘పరిహారం’: కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా కారణంతో మరణిస్తే వారికి సంబంధించిన పరిహారం, జీపీఎఫ్, సీజీఈజీఐఎస్ తదితర అన్ని మొత్తాలను సదరు ఉద్యోగి నామినీగా పేర్కొన్న కుటుంబ సభ్యులకే ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖలోని పింఛన్ల విభాగం తెలిపింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 30న మెమో జారీ చేసింది. విధి నిర్వహణలో ఉద్యోగులు మృతి చెందిన సందర్భాల్లో.. సంబంధిత పరిహారాన్ని ఎవరికి ఇవ్వాలన్న విషయంపై ఇప్పటి వరకు నిర్దిష్టంగా విధానాలేవీ లేవని పేర్కొంది. సీసీఎస్ నిబంధనల మేరకు ఎక్స్‌ట్రార్డినరీ పింఛన్‌కు అర్హులైన కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు తెలిపింది. అయితే.. సీసీఎస్ పింఛన్ నిబంధనలకు సవరణలు చేసిన నేపథ్యంలో స్వల్ప మార్పులు తీసుకువచ్చినట్టు పింఛన్ల విభాగం పేర్కొంది. విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగికి చెందిన అన్ని మొత్తాలను ఉద్యోగి పేర్కొన్న నామినీకే అందించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఉద్యోగి ఎవరినీ నామినీగా పేర్కొనకపోతే.. కుటుంబ సభ్యుల్లో అర్హులైన అందరికీ ఇవ్వనున్నట్టు పేర్కొంది.
0 Response to "ఉద్యోగుల నామినీకే ‘పరిహారం’: కేంద్రం"
Post a Comment