టీచర్ల బదిలీల్లో తిరకాసు!
ఆప్షన్ ఒకచోటకి.. బదిలీ మరోచోటకి
గగ్గోలు పెడుతున్న ఉపాధ్యాయులు
పలు జిల్లాల నుంచి ఫిర్యాదుల వెల్లువ
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ గందరగోళంగా మారింది. పలు స్కూళ్లకు బదిలీ ఆప్షన్ ఎంచుకునే అవకాశం లేకుండా ముందుగానే లాక్‌చేసి బదిలీల్లో పారదర్శకతను తుంగలోకి తొక్కారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ గజిబిజిగా మారిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తామిచ్చిన ఆప్షన్లతో సంబంధం లేకుండా బదిలీలు అయ్యాయని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఎంఈవో కార్యాలయాల్లో సీఆర్పీలు ఆప్షన్లు తప్పుగా ఎంటర్ చేయడంతో సంబంధం లేని చోటకు బదిలీ అయ్యామంటున్నారు. తాము ఒక వెబ్ ఆప్షన్ ఎంటర్ చేస్తే తాము ఎంచుకోని దూరపు ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్లు వచ్చాయని గగ్గోలు పెడుతున్నారు.
బదిలీల చిత్రాలు..
చిత్తూరు జిల్లా కలకడ మండలం ఎగువపాలెం ఎంపీయూపీ స్కూల్‌కు చెందిన డి.పాకీజ అనే టీచర్ తాను ఇచ్చిన ఆప్షన్‌కు సంబంధం లేకుండా కొండకింద కురవపల్లికి బదిలీ కావడంతో ఆందోళన చెంది డీఈవోకు మొరపెట్టుకున్నారు.
కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని పాపిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్ డి.లలితాబాయి భర్త చనిపోవడంతో విడో కేటగిరి కింద మారుస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆమోదించారు. ఆమె కోరుకున్న బదిలీ చేయకుండా అదే పాఠశాలలో కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గుంటకట్ట ఆఫ్ పోతిరెడ్డి పాలెంలో ఒంటరి మహిళ కింద 2017 నుంచి స్వర్ణలత అనే టీచర్ పనిచేస్తున్నారు. ఆమె మూడు ఆప్షన్లు పెట్టి నాలుగో స్థానంగా ఆమె పనిచేస్తున్న స్కూల్‌ను ఎంచుకుంది. అయితే ఎంఈవో లాగిన్‌లో ఆమె పనిచేస్తున్న సొంత పాఠశాలను రెండో ఆప్షన్‌లో ఉంచి అప్‌లోడ్ చేశారు.
నెల్లూరులోని కలువాయి మండలంలో ఉన్న తోపుగుంట ప్రాథమికోన్నత పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మన్నెం వెంకటప్రసాదరావు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆప్షన్లుగా మొదట కలువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, తోపుగుంట ప్రాథమికోన్నత పాఠశాలను ఎంచుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ రెండు ఆప్షన్లు మాత్రమే పెట్టి ఫ్రీజింగ్ చేశారని మండల విద్యాశాఖాధికారి కూడా చెప్తున్నారు. అయితే, ఆ టీచర్ లాగిన్‌లో మొదటి రెండు పాఠశాలలే కాకుండా 272 పాఠశాలలు ఎంపిక చేసుకున్నట్లు కనిపించాయి. వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవడంలో ఆ టీచర్ ఎలాంటి పొరపాటు చేయకపోయినా సీఆర్పీ చేసిన వెబ్ ఆప్షన్లులో తప్పులు దొర్లడంతో ఆయన సుదూరంలో ఉన్న అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడుకు బదిలీ అయినట్లు ఆదేశాలందాయి.
టీచర్ల లబోదిబో..
తాము చేయని పొరపాట్లకు దూరప్రాంతాలకు ఎందుకు బదిలీ కావాలని పలువురు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాల విద్యాశాఖకు విజ్ఞప్తులు పంపుతున్నారు. బదిలీ ప్రక్రియలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి తాము ఎంచుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు
0 Response to "టీచర్ల బదిలీల్లో తిరకాసు!"
Post a Comment