ఇక సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు
ఇకపై రాష్ట్రంలో భూములు, స్థలాలు, ఇళ్లు మొదలైన స్థిరాస్థుల రిజిస్ట్రేషన్లు గ్రామ/వార్డు సచివాలయాల్లో జరుగనున్నాయి. ఆయా గ్రామ/వార్డు వలంటీర్లు తమ పరిధిలోని ప్రజలు ఎవరైనా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే ఆ బాధ్యతను తామే తీసుకుంటారు. గ్రామ సచివాలయం నుంచి రిజిస్ర్టేషన్ దరఖాస్తు పూర్తిచేసి.. కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసి.. అక్కడే సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటారు. ప్రక్రియ అంతా పూర్తిచేసేసి...సబ్ రిజిస్ర్టార్ కార్యాలయానికి అనుమతి కోసం పంపిస్తారు. ఈ అనుమతి అనేది నామమాత్రమే. స్టాంపు రుసుం సరైనంత కట్టారా... లేదా? ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఆ భూమి ఉందో లేదో మాత్రం సబ్ రిజిస్ర్టార్ పరిశీలించి ఆమోదిస్తారు.
కొనుగోళ్లు, అమ్మకాలు, తనఖాలు, గిఫ్ట్ డీడ్ , భాగ పరిష్కారం.. ఇలా ఏ డాక్యుమెంట్ అయినా సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్ చేసేస్తారు. అదేవిధంగా రిజిస్ర్టేషన్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సచివాలయాల్లో అప్‌లోడ్ చేయడం వల్ల.. ఇక ఈసీలు, సీసీలు కూడా అక్కడే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నారు. అయితే సమగ్ర సర్వే పూర్తిచేసి, ఆ రికార్డంతా అప్‌లోడ్ చేశాక గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ఇబ్బందిలేకుండా సాగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వచ్చినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ యథాతథంగా రిజిస్ర్టేషన్లు కొనసాగుతాయి. గ్రామ సచివాలయాలు, లేకుంటే సబ్ రిజిస్ర్టార్ కార్యాయాల్లో ఎక్కడైనా రిజిస్ర్టేషన్లు చేయించుకోవచ్చు. గ్రామాల్లోనేగాక.. నగరాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్ చేయనున్నారు.
దూరాభారం తగ్గుతుంది
రాష్ట్రంలో సుమారు 400 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఇవి మండలానికి ఒకటి.. లేకుంటే రెండు మండలాలకు ఒకటి చొప్పున ఉన్నాయి. ఎవరు రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నా ఈ కార్యాలయాల వద్దకే వెళ్లాలి. గ్రామ సచివాలయాల్లోనే ఈ వ్యవస్థను పెడితే కొనుగోలుదారులు, విక్రేతలు దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో జాతరను తలపించే సంఘటనలు తగ్గిపోతాయి. మరోవైపు పారదర్శకత కూడా పెరుగుతుందని రిజిస్ర్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ర్టేషన్ చేయించుకునేవారికి అదనపు ఖర్చుల భారం పడకుండా.. తేలిగ్గా, సులభంగానే రిజిస్ర్టేషన్ అయిపోతుందని అనుకుంటున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి.. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన డేటాను చాలా వరకు అప్‌లోడ్ చేశారు. మొత్తం ప్రక్రియను త్వరలోనే పూర్తిచేసి, సమగ్ర భూసర్వే పూర్తయ్యాక ఆ సమాచారాన్నీ అప్‌లోడ్ చేసి కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరోవైపు ఈ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కొంతమేర క్లిష్టంగా ఉంటుంది కాబట్టి.. సచివాలయాల సిబ్బందికి దీనికి సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వనున్నారు
0 Response to "ఇక సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు"
Post a Comment