జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాత్ర పరిమితం: మోదీ
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం-2020పై ప్రధాని మోదీ ప్రశంసలు
కురిపించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం చాలా పరిమితంగానే ఉండాలని అన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి
రామ్‌నాథ్ కోవింద్, ప్రధని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్
ద్వారా మాట్లాడారు.
ఎన్‌ఈపీ ప్రారంభ సెషన్‌లో ప్రధాని మాట్లాడుతూ, దేశ ఆకాంక్షలను సఫలం చేయాలంటే విద్యా విధానం, వ్యవస్థ చాలా కీలకమైన సాధనాలని చెప్పారు. ఈ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అనుసంధానమై ఉంటాయని అన్నారు. విద్యా విధానంలో ప్రభుత్వానికి పరిమితమైన జోక్యం, పరిమిత ప్రభావం మాత్రమే ఉండాలని పేర్కొన్నారు.
'పాషన్, ప్రాక్టికాలిటీ, పెర్‌ఫారమెన్స్ అనేవి ప్రధానం. ప్రజాస్వామ్య విలువలను అభ్యసించేందుకు ఎలాంటి ఒత్తిళ్లు, ఎలాంటి ప్రభావం లేని విధంగా జాతీయ విద్యావిధానం ఉండాలి' అని ప్రధాని అన్నారు. విద్యార్థులపై అవసరానికి మించిన స్కూలు బ్యాగుల భారంపై మాట్లాడుతూ, బ్యాగుల, బోర్డు పరీక్షలు, సొసైటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు లేని విధంగా జాతీయ విద్యా విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఈ కాన్ఫరెన్స్‌లో గవర్నర్లు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులు హాజరయ్యారు.
సుదీర్ఘ కసరత్తు...
డాక్టర్ కె.కస్తూరి రంగన్ సారథ్యంలోని ప్యానల్ దేశంలోని పలువురు విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహా 2 లక్షల మంది అభిప్రాయాలను సేకరించి సుదీర్ఘకాలం చేసిన కసరత్తు అనంతరం ఎన్‌ఈపీ రూపకల్పన జరిగింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య దాకా సంస్కరణలు తీసుకురావడం, భారత్ కేంద్రంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచంలో భారత్‌ను సూపర్ పవర్‌గా తయారు చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా వెబినార్లు, వర్చువల్ సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించింది
0 Response to "జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాత్ర పరిమితం: మోదీ"
Post a Comment