‘నాడు-నేడు’ కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్‌

  • టెన్త్‌ పరీక్షల తర్వాతే..పిల్లల అవసరాలే ప్రాతిపదిక
  • పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై మ్యాపింగ్‌ చేయాలి
  • ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం



అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల అవసరాల ప్రాతిపదికగా, ఆన్‌లైన్‌ పద్ధతిలోనే బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలన్నారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ కార్యక్రమంపై సమీక్ష జరిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లను ఉంచాలని, రీ పొజిషన్‌ చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు ప్రతిపాదనలను  సీఎం ముందుంచగా.. అందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఏఏ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. టీచర్ల రీ పొజిషన్‌కు, పిల్లలకు మంచి చేసే ఉద్దేశంతో విధివిధానాలు రూపొందించాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలని, విద్యార్థుల్లో ఉన్న లోపాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందించడానికి విప్లవాత్మక ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్ర యాప్‌కు రూపకల్పన చేయాలన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘నాడు-నేడు’ కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్‌"

Post a Comment