విద్యాసంవత్సరంపై కేంద్రం కీలక నిర్ణయం



సిలబస్‌, పనిగంటలు మార్పుకు యోచన

సూచనలు పంపాలని కోరిన కేంద్ర మంత్రి

దిల్లీ: రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు 'సిలబస్‌ ఫర్‌ స్టూడెంట్స్ 2020' హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. '' ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు రాబోయే విద్యాసంవత్సరానికి బోధనాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాం'' అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.




ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చని మంత్రి రమేశ్‌ పోక్రియాల్ నిశాంక్ సోమవారం సూచనప్రాయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర మాన వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనితా కార్వాల్ (పాఠశాల విద్య) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల ఆరోగ్యం, భద్రత, పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిజిటల్‌ తరగతుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా మార్చి 16 నుంచి కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, యూనివర్శిటీలు మూసివేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్ధులను తర్వాతి తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు కొత్త విద్యాసంవత్సరాన్ని కొనసాగిస్తూ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యాసంవత్సరంపై కేంద్రం కీలక నిర్ణయం"

Post a Comment