లాక్‌డౌన్ వేళ గుడ్‌న్యూస్.. మే 12 నుంచి

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దాదాపు 47 రోజులుగా దేశవ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. గూడ్స్ రైళ్లు, వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ ప్రత్యేక రైళ్లు మాత్రమే ఇప్పటివరకూ రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే.. ప్యాసింజర్ ట్రైన్స్‌కు సంబంధించి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే.. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి 15 రూట్లలో రాకపోకలకు 30 రైళ్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.



ప్రత్యేక రైళ్లు దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఢిల్లీ నుంచి డిబ్రూగర్(అస్సోం), అగర్తలా(త్రిపుర), హౌరా(పశ్చిమబెంగాల్), పాట్నా(బీహార్), బిలాస్‌పూర్(ఛత్తీస్‌గడ్), రాంచీ(జార్ఖండ్), భువనేశ్వర్(ఒడిశా), సికింద్రాబాద్(తెలంగాణ), బెంగళూరు(కర్ణాటక), చెన్నై(తమిళనాడు), తిరువనంతపురం(కేరళ), మార్‌గావ్(గోవా), ముంబై సెంట్రల్(మహారాష్ట్ర), అహ్మదాబాద్(గుజరాత్), జమ్ముతావి(జమ్మూ) రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఏపీకి నేరుగా ఒక్క రైలు కూడా లేకపోవడం గమనార్హం.



ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలనుకునేవారికి మే 11, సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "లాక్‌డౌన్ వేళ గుడ్‌న్యూస్.. మే 12 నుంచి"

Post a Comment