విద్యావ్యవస్థలో సమూల మార్పులు

సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

చిత్తూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యావవ్యస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభిప్రాయపడ్డారు. జిల్లా విద్యాశాఖ ప్రగతిపై చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రి బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పారు



ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదని, అందుకే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దీని ప్రకారం జిల్లాల్లో ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.15వేలు చొప్పున జమచేయనున్నామని, ఇందుకు రూ.558 కోట్లు అవసరమని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాలతో పాటు ఏకరూప వస్త్రాలు, బూట్లు, సాక్సులు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందని, కేంద్రీకృత వంటశాలల నిర్మాణానికి రెండెకరాల స్థలం అవసరమన్నారు. పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని సూచించారు. ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు సేకరించి ఏటా జనవరిలో డీఎస్సీ నిర్వహిం చనున్నామని తెలిపారు. 2018 డీఎస్సీ నియమకాలు త్వరలో పూర్తిచేస్తామని ప్రకటించారు.

సీపీఎస్‌పై చర్చ జరుగుతోంది

సీపీఎస్‌పై చర్చ జరుగుతోందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతిభా అవార్డులకు సంబంధించి కొత్త విధానాలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకు సంబంధించి విద్యాశాఖ రూ.65కోట్లను వేరే శాఖకు బదలాయించిందన్నారు. అక్కడి నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు.

విద్య ఆవశ్యకతను తెలియజేయండి

దేశ అభివృద్ధికి విద్య ఆవశ్యకత అవసరమని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఉపాధ్యాయులు అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. 1984 నుంచి పాదిరికుప్పం ఉన్నత పాఠశాలలో గుమస్తా, వ్యాయామ ఉపాధ్యాయుడు లేరని చెప్పారు. ఇటీవల కలెక్టర్‌ పాఠశాలను సందర్శించి పీఈటీని డిప్యూటేషన్‌పై నియమించారని పేర్కొన్నారు.

ఈ సమీక్షలో జేసీ-2 చంద్రమౌళి, పాఠశాల విద్య ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, డీఈవో పాండురంగ స్వామి, ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటరమణారెడ్డి, ఉప, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు

జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను విద్యామంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ వెబ్‌సైట్‌ని ఏపీవో ప్రేమకుమార్‌ రూపొందించారు. deochittoor.net లో విద్యాశాఖ కార్యక్రమాల గురించి తెలుసుకో వచ్చని రూపకర్త ప్రేమకుమార్‌ వివరించారు.

పక్కా భవనాలు అవసరం: ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిత్తూరు

పలు పాఠశాలల్లో పక్కా భవనాలు నిర్మించాలి. మరికొన్ని చోట్ల అదనపు తరగతి భవనాలు అవసరం. విద్యార్థులకు పోషకాహారం అందించాలి.

మూడో తరగతి పుస్తకం చదవలేకపోతున్నారు: కలెక్టర్‌

ప్రభుత్వ పాఠశాలలను తరచూ తనిఖీ చేస్తున్నాం. ఆరో తరగతి విద్యార్థి మూడో తరగతి పుస్తకం చదవలేకపోతున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెరగాలి. ప్రహరీల నిర్మాణం ఉపాధి నిధులతో చేపడుతున్నాం. విద్యాశాఖ సైతం నిధులు ఇవ్వాలి. ఎస్‌ఎస్‌ఏలో ఇంజినీరింగ్‌ సిబ్బంది కొరత ఉంది.

రేకుల గదిలో బోధన: కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్యే, సత్యవేడు

ప్రభుత్వ పాఠశాలల్లో పక్కా భవనాలు లేకపోవడంతో రేకుల షెడ్‌లలో తరగతులు నిర్వహించడం బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

పిల్లల్లో కనీస ప్రమాణాలు లేవు: ఎమ్మెల్సీ విఠపు

ప్రస్తుతం ప్రధాన సమస్య పిల్లల్లో కనీస విద్యా ప్రమాణాలు లేవు. జిల్లాలో 1,200 ఎస్జీటీలు, 13 ఎంఈవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలిక పద్ధతిలోనైనా ఖాళీలను భర్తీ చేయాలి. రెండేళ్లకు ముందు ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టతరంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి కన్పించలేదు.

ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ యండపల్లి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. కుప్పం నియోజకవర్గంలో 350 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి. అక్షయపాత్ర, ఇస్కాన్‌ సంస్థలు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు ఇవ్వడంలేదు. ప్రైవేటు ఏజెన్సీలను రద్దు చేయాలి.

విద్యార్థినులకు న్యాప్‌కిన్స్‌ ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే గాంధీ

ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థినులకు న్యాపికిన్స్‌ ఉచితంగా అందజేయాలి. కుప్పం ప్రాంతంలో ఉపాధ్యాయులు పనిచేయకపోవడంతో అక్కడి విద్యార్థులు నష్టపోతున్నారు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహక నగదు అందజేయడం ద్వారా ఆ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యావ్యవస్థలో సమూల మార్పులు"

Post a Comment