బ్యాంకింగ్‌ ప్రక్షాళన

25, 26న అన్ని రాష్ట్రాల ఎస్‌ఎల్‌బీసీల భేటీ


దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం ఎలా? ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి?

గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)లు భారీగా పెరగడానికి కారణమేమిటి? దీనిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

 

ఈ ప్రశ్నలు చదివితే మీకేమనిపిస్తోంది? బహుశా... బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఇంటర్వ్యూలో అడిగారని అనుకుంటున్నారా!? కానే కాదు! దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బ్యాంకుల బ్రాంచ్‌ మేనేజర్లకు కేంద్ర ఆర్థిక శాఖ సంధించిన అనేక ప్రశ్నల్లో మచ్చుకు ఇవి కొన్ని! ‘బ్యాంకింగ్‌’లో అసలేం జరుగుతోంది? కేంద్రం ఏం చేయాలనుకుంటోంది? పెద్ద నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు... బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందా? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది...

 

వ్యవసాయం నుంచి విదేశీ విద్య దాకా! బడ్డీ కొట్టు నుంచి బిర్లాల వరకు! ఎవరికైనా... ఎక్కడైనా రుణం ఇచ్చేది బ్యాంకులే! ఆర్థిక రథానికి ప్రధాన ఇరుసు బ్యాంకింగ్‌ రంగమే! ఇలాంటి కీలకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థలో అతి భారీ సంస్కరణలు చేపట్టేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల వెన్ను విరుస్తున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) సమస్యతో మొదలుకుని దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం వరకు... సంక్షేమం, పరిశ్రమలు, ఎగుమతులు, నగదు రహిత లావాదేవీలు ఇలా అనేక రంగాల్లో బ్యాంకింగ్‌ పాత్రను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

 

దీని వెనుక... ప్రభుత్వ ఆర్థిక, సామాజిక, సంక్షేమ లక్ష్యాల సాధనలో బ్యాంకింగ్‌ పాత్రను పెంపొందించడమనే మరో లక్ష్యం కూడా ఉంది. దీనికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలకు తలపండిన ఆర్థిక నిపుణులను కాకుండా... క్షేత్రస్థాయిలో జనంలో ఉండి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే బ్రాంచ్‌ మేనేజర్ల నుంచే సమాచారం రాబడుతోంది. బ్యాంకింగ్‌ చరిత్రలోనే తొలిసారిగా కేంద్రం నేరుగా బ్రాంచ్‌ మేనేజర్లకు ఒక ప్రశ్నావళిని పంపి, వాటికి సమాధానాలు చెప్పాలని కోరింది. రెండు మూడు రోజుల్లోనే సమాచారం పంపాలని కోరడంతో... జాతీయ స్థాయిలో అన్ని బ్యాంకుల్లో ఇది హల్‌చల్‌ సృష్టించింది. ప్రైవేటు బ్యాంకుల నుంచీ ఈ సమాచారం సేకరిస్తున్నారు.

 

సూక్ష్మ స్థాయి సమాచారం...

కేంద్రం పథకాలను ప్రకటిస్తుంది. ఆర్థిక విధానాలను రూపొందిస్తుంది. కానీ... క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయాల్సింది మాత్రం బ్యాంకులే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడం, ఎన్‌పీఏలు, మొండి బకాయిలను తగ్గించడం, ‘ముద్ర’లాంటి ప్రభుత్వ పథకాలకు రుణాలు పెంచడం, రిటైల్‌ రంగానికి రుణ సౌకర్యం పెంచడం, రుణాల మంజూరు విషయంలో ఉన్న ఇబ్బందులను తొలగించడం తదితర అంశాలపై సరికొత్త ప్రణాళిక నిర్ణయించాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 

దీనికి సంబంధించిన సమాచార సేకరణ అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. ఒక్కో అంశానికి సంబంధించి ఐదారు ప్రశ్నలు సంధించారు. అన్నింటిపైనా అందరినీ కాకుండా... కొందరికి కొన్నేసి చొప్పున ప్రశ్నలిచ్చి సమాధానం రాబడుతున్నారు. ఈ సమాచార సేకరణ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. మిగిలింది కూడా పూర్తిచేశాక... రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో (ఎస్‌ఎల్‌బీసీ) 25, 26వ తేదీల్లో ఢిల్లీలో చర్చిస్తారు. అన్ని బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి... బ్యాంకింగ్‌లో ఎలాంటి సంస్కరణలు తేవాలన్న దానిపై అంచనాకు వస్తారని తెలుస్తోంది.

 

బ్రాంచ్‌ మేనేజర్లను అడిగిన ప్రశ్నల్లో ఇవి కొన్ని...

నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా నిరర్థక ఆస్తులు పెరగడానికి కారణాలేంటి?


రికవరీ బాగుండేలా ఏం చేయాలి? క్రెడిట్‌ కల్చర్‌ ఎలా పెంచాలి?


మీ శాఖ పరిధిలో ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి? వాటికి సరైన రుణ సౌకర్యం కల్పిస్తున్నారా?


వ్యాపారాలను ప్రోత్సహించేందుకు మరింత రుణ సౌకర్యం కల్పించేందుకున్న అవకాశాలేంటి?


అర్హత ఉన్న ఎంఎ్‌సఎంఈలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నారా? ఐదేళ్లలో ఎగుమతి రుణాల శాతం తగ్గితే కారణాలేంటి?


ప్రతి బ్యాంకు బ్రాంచ్‌ నుంచి కనీసం 100మంది వ్యాపారస్తులైనా పూర్తిస్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు చేయగలుగుతున్నారా? నగదు రహిత లావాదేవీల అమలులో ఎలాంటి ఇబ్బందులున్నాయి?


జన్‌ధన్‌ ఖాతాలు ఎన్ని ప్రారంభించారు? ఎన్ని రూపే కార్డులిచ్చారు?


సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారా?


బాలికా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలేవి?


ముద్ర పథకం కింద దరఖాస్తుదారులకు రుణాలందించడంలో ఉన్న ఇబ్బందులేంటి? వీటిని నివారించేందుకు ఏం చేయాలి?


59 నిమిషాల్లోనే రుణ దరఖాస్తులను ప్రాసెస్‌ చేసి...రుణం అందించాలన్న లక్ష్యం నెరవేరుతోందా?


టెక్నాలజీ ద్వారా మోసాలను అరికట్టే మార్గాలేంటి?


కొత్తగా ఎంతమంది రైతులకు రుణాలిచ్చారు?


2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేర్చడంలో బ్యాంకులు ఎలాంటి పాత్ర పోషించాలి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బ్యాంకింగ్‌ ప్రక్షాళన"

Post a Comment