అరచేతిలోఈ- గ్రంథాలయం

నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా'లో 70 భాషల్లో 68 లక్షల పుస్తకాలు

కడప (బిల్టప్‌), న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా వివిధ పుస్తకాలు చదవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో పుస్తకాలకు గిరాకీ పెరిగింది. వివిధ పుస్తకాలను చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొనలేనివారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.ఒకటి కూడా ఖర్చు లేకుండా లక్షలాది పుస్తకాలను ఇంట్లోనే ఉండి చదువుకునే అవకాశం వస్తే.. అది పుస్తక ప్రియులకు ఎంతటి శుభవార్తో కదా. అవును ఇదంతా ఈ- గ్రంథాలయం ద్వారా సాధ్యమవుతుంది.

అందుబాటులో లక్షల పుస్తకాలు





ఈ - గ్రంథాలయంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందరికీ అవసరమైన పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉంటున్నాయి. ఇంట్లో కంప్యూటర్, లేకపోతే చేతిలో మొబైల్‌ ఫోన్‌ వాటికి అంతర్జాల(ఇంటర్నెట్‌) సదుపాయం ఉంటే చాలు. మీకు ఇష్టమైన, అవసరమైన పుస్తకాలను ఇంట్లో కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. చరవాణిలో 'నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా' యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే పుస్తకాలు అర చేతిలో ఉన్నట్టే.

ఎందరో రచయితలు..

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌ సహకారంతో 'డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా' పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించింది. ఇందులో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 70 భాషల్లో 68 లక్షల పుస్తకాలు ఉంటాయి. సుమారు 3 లక్షల మంది రచించిన ఏడు లక్షల పుస్తకాలు, రెండు లక్షల మంది రచయితలు రచించిన 3 లక్షల కథనాలు, 262 ఆడియో కథనాలు, 18,000 పైగా వీడియో కథనాలు అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ, కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, జనరల్‌ ఫిలాసఫీ, సైకాలజీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ఎలా చదవాలంటే..

అంతర్జాలంలో గూగుల్‌లోకి వెళ్లి ఎన్‌డీఎల్‌.ఐఐటీకేజీపీ.ఏసీ.ఎన్‌(నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా) లాగిన్‌ అవ్వాలి. తెరపై వచ్చిన అంశాలను క్షుణ్ణంగా చూసుకుని వ్యక్తిగతంగా, సంస్థల పరంగానే నమోదు చేసుకోవాలి. ఇందులో ఈ-మెయిల్, చిరునామా, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకోవాలి. ఒకసారి నమోదు చేసుకున్నాక ఎప్పుడైనా లాగిన్‌ అయి కావాల్సిన పుస్తకాలను చదువుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ చరవాణులు కలిగిన ప్రతి ఒక్క వెబ్‌సైట్‌ ద్వారా పుస్తకాలు చదువుకోవచ్చు. అవసరమైన పుస్తకాలను డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అరచేతిలోఈ- గ్రంథాలయం"

Post a Comment